రఘురామకృష్ణంరాజు విషయంలో తప్పు చేశామని ఫీలవుతున్న వైసీపీ నేతలు!!

కొన్ని విషయాలలో ఆలస్యం చేయడం వల్ల భారీ నష్టం జరుగుతుందని.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి బోధ పడింది. ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో చేసిన ఆలస్యం.. ఆయనను హీరోని చేసింది, పార్టీని ఇరుకున పెట్టింది. నిజానికి కొన్ని నెలల ముందు వరకు రఘురామకృష్ణంరాజు ఎవరో పెద్దగా తెలియదు. ఒకవేళ తెలిసినా.. వ్యాపారవేత్త గానో, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కేవీపీ రామచంద్రరరావుకు వియ్యంకుడిగానో పరిచయం. మొదట టీడీపీ లో చేరిన రఘురామకృష్ణంరాజు.. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి.. నర్సాపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అలా తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టారు. ఎంపీగా గెలిచినా తర్వాత నుండి అప్పుడప్పుడు ఆయన పేరు వినపడటం మొదలుపెట్టింది. జాతీయ స్థాయిలో దాదాపు 350 మంది ఎంపీల‌కు విందు ఇచ్చి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఆ తరువాత.. అలాంటి విందులైతే ఏమీ ఇవ్వలేదు కానీ.. ఏదోక విషయంలో సొంత పార్టీకి పంచ్ లు ఇస్తూ వస్తున్నారు. దాంతో ఆయన పేరు మారుమోగిపోతోంది. 

మొదట.. ఇంగ్లీషు మీడియం విషయంలో పార్లమెంట్‌ సాక్షిగా వైసీపీ వైఖరికి భిన్నంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. ఆ తరువాత.. టీటీడీ భూముల‌ అమ్మకాల‌పై, ఇసుక కొరతపై బహిరంగంగా విమర్శించారు. తన నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్ప‌డుతున్నారని, వారిని కట్టడి చేయాల‌ని, సీఎం తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతోనే ఇలా బహిరంగంగా చెప్పాల్సి వస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యల‌పై వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు స్పందించడంతో రచ్చ ముదిరింది. రఘురామకృష్ణంరాజు మాటల్లో మరింత వేడి పెరిగింది. తాను ఎంపీ గా జగన్‌ బొమ్మతో గెల‌వలేదని, ఆయన బొమ్మ లేకుండా గెలవగలను, దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు  రాజీనామా చేసి గెలవాలని సవాల్ చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల బల‌గంతో తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న జగన్‌ కు వ్యతిరేకంగా.. సొంత పార్టీకి చెందిన ఒక ఎంపీ మాట్లాడుతుండడంతో పార్టీ నేతలు తలలు పట్టుకున్నారు. ఇక, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయాక.. పార్టీ ఆయనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చింది.

షోకాజ్‌ నోటీసుతో రఘురామకృష్ణంరాజు ఇరుకున పడతారేమో అనుకుంటే.. రివర్స్ లో ఆయనే పార్టీని ఇరుకున పెట్టారు. అసలు మన పార్టీ పేరు 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ' అయితే 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' పేరుతో నోటిస్ ఇచ్చారేంటి? ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మన పార్టీ 'వైఎస్సార్' అనే పేరు ఉపయోగించకూడదు కదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో పార్టీ నెత్తిన పిడుగు పడినట్లయింది. ఇక మీదట పార్టీ పేరు 'వైఎస్సార్ కాంగ్రెస్' అని పిలవడం కుదరదా అని పార్టీ నేతలు తెగ బాధపడుతున్నారు. కొందరైతే మొదట్లోనే రఘురామకృష్ణంరాజు ని సస్పెండ్ చేసుంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదుగా అని ఫీలవుతున్నారు. ఇంగ్లీష్ మీడియం, టీటీడీ భూముల వేలం, ఇసుక కొరత, ఎమ్మెల్యేల అవినీతి.. ఇలా వరుసగా వ్యాఖ్యలు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారు. ఇప్పుడేమో ఆయన ఏకంగా పార్టీ పేరుకే ఎసరు పెడుతున్నారు. ఆయన చేస్తోన్న రగడ పార్టీకి తల‌వంపులు తీసుకొస్తోంది.. పార్టీని ఢిల్లీ స్థాయిలో చుల‌కన చేస్తోంది. అదేదో ఆయనను ముందే సస్పెండ్ చేసుంటే.. మన పార్టీకి ఇన్ని తిప్పలు వచ్చేవి కావు, ఆయనకు అంత క్రేజ్ వచ్చేది కాదని పార్టీ నేతలు తెగ ఫీలైపోతున్నారట.