ఫేస్బుక్ రౌడీలు.. ట్విట్టర్ గూండాలు!

 

రౌడీలు, గూండాలు అంటే మనకు ఒక ఊహ వుంటుంది. వారు భారీ ఆకారాలతో, భీకరమైన పనులతో, వెంట ఓ ముఠాని వేసుకుని తిరుగుతూ వుంటారని అనుకుంటాం. ఇంత కాలం అదే నిజం కూడా. కాని, సోషల్ మీడియా శకం మొదలయ్యాక రౌడీ, గూండా అనే మాటలకు అర్థాలు మారిపోయాయి! ఈ సోషల్ మీడియా గూండాలు, రౌడీలు, పోరంబోకులు కళ్లకు కనిపించరు. వినిపించరు. కేవలం ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సైట్లలో కామెంట్లు పెడుతూ, ఇబ్బంది పెడుతూ, బెంబేలెత్తిస్తుంటారు. వీళ్లు ఈ మతం ఆ మతం అని కాదు... అన్ని మతాల వారూ వుంటుంటారు! కొన్ని మతాల్లోని ఛాందసవాదులు మరింత ఎక్కువ దాదాగిరి, గూండాగిరి చేసేస్తుంటారు. ఎంతగా అంటే సెలబ్రిటీలు సైతం వీళ్ల బారినపడి అల్లాడిపోవాల్సిందే. బెదిరిపోవాల్సిందే.

 

ఇంటర్నెట్ దౌర్జన్యానికి తాజా ఉదాహరణ దంగల్ చిత్రంలో నటించిన బాలనటి జయిరా వాసిమ్ ఉదంతమే. ఆమెకి జస్ట్ పదహారేళ్లు. దంగల్ చిత్రంలో ఆమీర్ కూతురిగా నటించింది. గీతా ఫోగట్ అనే రెస్లర్ చిన్న నాటి పాత్రలో జయిరా కనిపించింది. ఆ పాత్రకి బాగా పేరు రావటంతో ఆమె జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని గౌరవపూర్వకంగా కలిసింది. జయిరాది కాశ్మీరే. అయితే, దంగల్ లాంటి చిత్రంలో గొప్ప పాత్ర చేసినందుకు కాశ్మీర్ సీఎం జయిరాను మెచ్చుకుంది. ట్విట్టర్ లో తాను ఎంతో మందికి రోల్ మోడల్ అని కీర్తించింది. అది నిజం కూడా!

 

తన స్వంత రాష్ట్ర ముఖ్యమంత్రి బాగా పొగిడితే ఎవరికి మాత్రం ఆనందం కలగదు? కాని, జయిరా మాత్రం మెహబూబాను కలిసిన కొన్ని రోజులకి ఓ పెద్ద క్షమాపణ లేఖ షేస్బుక్ లో పోస్ట్ చేసింది. తాను కొందరిని కలిసి తప్పు చేశానని, తాను ఎవరికీ రోల్ మోడల్ కాననీ, ఇంకా చాలా మంది గొప్పవారు వున్నారని జయిరా చెప్పుకొచ్చింది. తనని క్షమించమని వేడుకొంది. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది? మనం ఇందాకా మాట్లాడుకున్న ఇంటర్నెట్ రౌడీ మూకల వల్ల! జయిరా దంగల్ లో నటించటం, మెహబూబాను కలుసుకోవటం కాశ్మీర్ లోని వేర్పాటువాదులకి నచ్చలేదు. వాళ్ల తమ ఛాందసవాదం అంతా బయటకి తీసి పదహారేళ్ల జయిరాపై సోషల్ మీడియాలో విషంగక్కారు. కామెంట్సు, బెదిరింపులు, బూతులతో బిక్కచచ్చిపోయేలా చేశారు. దాని ఫలితమే జయిరా వాసిమ్ క్షమాపణ లేఖ. అయితే, ఆమె సారీ చెబుతూ పెట్టిన పోస్ట్ కొంత సేపటికే డిలీట్ చేసేసింది. తరువాత ఈ గొడవని ఇక్కడితో వదిలేయండని మనవి చేసింది!

 

దంగల్ లో నటించి పాప్యులర్ అయిన బాలనటి సోషల్ మీడియాలో దాడి ఎదుర్కోవడం ఆమీర్ సహించలేదు. తాను అండగా వుంటానని చెప్పాడు. జయిరా తప్పు చేయలేదని, తనకు కూడా ఆమె రోల్ మోడల్ అని చెప్పాడు. కాని, ఆశ్చర్యకరంగా మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్... సోషల్ మీడియాలో జయిరాను భయపెట్టిన ఛాందసవాదుల్ని మాత్రం పల్లెత్తు మాటనలేదు. ఆమీర్ బాటలోనే ఇప్పుడు చాలా మంది ప్రముఖులు జయిరాకి జైకొడుతున్నారు కాని అసలు రౌడీల్ని, గూండాల్ని మాత్రం విమర్శించలేకపోతున్నారు!

 

జయిరా వాసిమ్ మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా క్రికెటర్ మహ్మద్ షమీ కూడా హీట్ ఎదుర్కొన్నాడు. ఆయన భార్యతో దిగిన ఫోటో షేర్ చేస్తే ఛాందసవాద నెటిజన్లు తిట్టిపోశారు. బురఖా లేకుండా గ్లామరస్ దుస్తులు ఆమె వేసుకున్నందుకు ఆగ్రహఃతో ఊగిపోయారు. ఇక మరో క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూర్య నమస్కారాలు చేస్తూ ఫోటోలు పెట్టాడు. వాట్ని కూడా సోషల్ మీడియా అరాచకులు వదల్లేదు. కైఫ్ ని రోజుల తరబడి వెంటాడారు.ఇంటర్నెట్ లో తమకు నచ్చని వార్ని వేధించటం కేవలం ముస్లిమ్ ఛాందసవాదులే చేస్తారనుకోలేం. మిగతా మతాల వాళ్లు కూడా ఇలాంటి దాడికి దిగుతుంటారు. కాకపోతే, చేసింది ఎవరైనా ఈ ఆధునిక రౌడీయిజం వ్యక్తిగత స్వేచ్ఛకు తీవ్రంగా భంగం కలిగిస్తోంది. అందరూ దీనిపై పోరాడాల్సిన అవసరం వుంది.