సునో మియా! దాల్మియా కా సస్పెన్స్ కహానీ

 

రామాయణ మహాభారత భాగవతాది గ్రంధాలను యుగాల నుండి పటిస్తున్నా ఎప్పటికప్పుడు సరికొత్తగానే దర్శనమిస్తాయవి. ఆ మహత్ గ్రంధాలకు ఎంతమంది పండితులు ఎన్నిభాష్యాలు చెప్పినా అక్షయ పాత్రలో ఆహరంలా ఇంకా చెప్పవలసినవి మిగిలే ఉంటాయి.

 

ఇప్పుడు ఈ కలియుగంలో కూడా ఎంత చెప్పుకొన్నాఅంతు దొరకని అవినీతి కధ ఒకటుంది. అదే జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల కధ. సీబీఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపన్ను, సీబీఐ కోర్టు, సుప్రీం కోర్టు, హైకోర్టు, పోలీసులు వగైరా వగైరా శాఖలన్నీకలిసి నెలల తరబడి శ్రమిస్తున్నా కూడా జగన్ మోహన్ రెడ్డి అవినీతి భాగోతం మొదలు ఆఖరు ఎక్కడుందో కనిపెట్టలేక పోతున్నాయి. బహుశః ఈ భాగోతం మొత్తం కనిపెట్టాలంటే మరొక ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటుచేసుకోవాలేమో.

 

ఎంతకీ అంతమవ్వని ఈ అద్భుతమయిన ధారావాహికంలో ప్రతీ ఎపిసోడ్ లో ఒక ఆశ్చర్యకరమయిన మలుపు లేదా సన్నివేశం ఉంటుంది. పోతే, రాజమౌళి సినిమాలలో మాదిరిగానే మొత్తం ధారావాహికం అంతా ఫ్లాష్ బాక్ లోనే సాగడం దీని ప్రత్యేకత. కాకపోతే ఈ దారావాహికంలో పునర్జన్మలు ఇంకాలేవు. ఉంటే కధ మరింత రక్తి కట్టేదేమో!

 

ఇక ఈ రోజు ఎపిసోడ్, దాల్మియా సిమెంట్స్ కంపెనీ సీనియర్ అధికారి సంజయ్ మిత్ర (8వ ముద్దాయి), దాల్మియా సిమెంట్స్ కంపెనీ యండీ పునీత్ దాల్మియాను సీబీఐ ప్రశ్నించడం అనే సీన్ తో ఓపెన్ అవుతుంది.

 

సీబీఐ అధికారులకి వారు చెప్పిన వివరాలివి: దాల్మియా కంపెనీలో పనిచేసే కొంత మంది ఉన్నతాధికారుల పేర్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు విజయ బ్యాంక్ లలో మొత్తం 26 లాకర్లు తెరువబడ్డాయి. కానీ, ఈ లాకర్లు కంపెనీ సీనియర్ మేనేజర్ నీల్ కమల్ బేరి మరియు బ్యాంక్ మేనేజర్ జాయ్ దీప బసుల జాయింట్ అకౌంట్ గా నిర్వహించాబడేవి. వాటికి ‘జేఆర్’ అనేది కోడ్ వర్డ్.

 

ఈ లాకర్లలలో నిలువచేసిన దాదాపు రూ.100కోట్లు 2008-’09 మద్య డిల్లీ, కోల్ కతా మరియు చెన్నై లలో జగన్ మోహన్ రెడ్డికి చెందిన వివిధ కంపెనీలకు ‘అనధికార కుటుంబ ఖర్చుల పద్దు’ క్రింద పంపబడ్డాయి. అయితే ఈ సొమ్మును ఎవరికి పంపాలి, ఎంత పంపాలి వంటి వివరాలు నిర్ణయించేది మాత్రం కంపెనీ సీనియర్ సలహాదారు భరుణ్ జీ అనే పెద్ద మనిషి. ఆయనకి తప్ప ఇతరులెవరికీ ఈ విషయంలో ప్రశ్నించే అధికారం కానీ, ఈ ఖర్చులకి పద్దు నిర్వహించే అధికారం కానీ లేదు.

 

ఆయన పంపించే ఒక పింక్ రంగు కాగితం మీద ఎంత మొత్తం లాకర్ల నుండి ఎంత తీయాలి, ఎవరికి ఈయాలి? అనే రెండు వివరాలతో బాటు ఒక టోకెన్ నెంబర్ కూడా ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి కంపెనీలకు హవాలా మార్గం ద్వారా అందజేసే నసీం మరియు బాబు అనే వ్యక్తులలో ఎవరో ఒకరు వచ్చి టోకెన్ నెంబర్ అడుగినప్పుడు ఆ నెంబర్ చెపితే వారు అ సొమ్మును చెప్పబడిన అకౌంట్స్ లోకి బదిలీ చేస్తారు. ఈ వ్యవహారం మొత్తం కంపెనీ సీనియర్ అధికారి నీల్ కమల్ భేరి అనే వ్యక్తి చేతుల మీదుగా జరిగేది.

 

ఈ విధంగా 2011 వరకు కూడా లాకర్లలో సొమ్ము బయటకి వెళ్ళింది. మాజీ ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత జగన్ మోహన్ రెడ్డి ఆర్ధిక సలహాదారు విజయసాయి రెడ్డి డబ్బుపంపని కోరినప్పుడు, మా మద్య ఉన్న సంబందాలను దృష్టిలో ఉంచుకొని భరుణ్ జీ తో చర్చించిన తరువాత రూ 10-20కోట్లు అయన కంపెనీ ఖాతాలోకి పంపడం అయింది. ఖచ్చితంగా ఆ మొత్తం ఎంత అనే విషయం మాత్రం కేవలం భరుణ్ జీ ఒక్కరికి మాత్రమే తెలుసు. ఈ మొత్తం వ్యవహారంలో కేవలం ఆయనదే తుది నిర్ణయం. మిగిలిన వారందరూ కూడా కేవలం నిమిత్తమాత్రులే.

 

ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో కొసమెరుపు ఏమిటంటే ఈ కధలో నిమిత్తమాత్రులయిన పాత్రధారులందరూ ఉన్నారు. కానీ, అసలయిన సూత్రధారి భరుణ్ జీ 2011లో మరణించారు. అదేవిధంగా అంతవరకు నిత్యం ఆఫీసుకి వచ్చిహవాలా ద్వారా కోట్ల రూపాయలను జగన్ చెప్పిన ఖాతలలోకి అవలీలగా పారింపజేసిన నసీం మరియు బాబులు కూడా సీబీఐ జగన్ డొంక లాగడం మొదలుపెట్టగానే అకస్మాత్తుగా కనబడకుండా మాయమయిపోయారు. ప్రస్తుతం వారికోసం సీబీఐ వెతుకుతోంది.

 

ప్రస్తుతం చాలా మంది మంత్రులు సైతం విజయవంతంగా ఆచరిస్తున్నపద్ధతినే మన పాత్రదారులు కూడా అనుసరిస్తూ కనబడని సూత్రధారి మీదకు అంతా నెట్టేసి చేతులు దులుపుకొన్నారు సూత్రదారులు ముగ్గురూ ఎపిసోడ్ చివరిలో అదృశ్యం అవడంతో ఈ సస్పెన్స్ ధారావాహికం సశేషంగా ముగుస్తుంది.

 

ఇంతకీ ఆ నసీం మరియు బాబు ఎలా మయమయిపోయారు? వారిద్దరూ ఎప్పటికయినా దొరుకుతారా? దొరికితే నిజం ఒప్పుకొంటారా? లేకపోతే మరో కొత్త సూత్రధారి పేరు చెప్పి వారు కూడా ఈ దారావాహికాన్ని రక్తి కట్టిస్తారా? వివరాలకు మరో ఎపిసోడ్ వరకు ఎదురుచూడండి.