తాటాకు చప్పుళ్ల చైనా... తన పని తాను చేసుకుపోతున్న ఇండియా!

ఇండియా, పాకిస్తాన్ కసిగా కొట్లాడుకునే శత్రువులైతే ... ఇండియా , చైనా నవ్వుతూ బెదిరించుకునే ప్రత్యర్థులు! మరీ ముఖ్యంగా, డ్రాగన్ దాదాగిరి మరీ దారుణంగా వుంటుంది మన మీద. గత ప్రభుత్వాల కాలంలో బాగా అలవాటైపోయిన ఆచారం అంత త్వరగా వదులుకోలేకపోతోంది బీజింగ్. మనతో వ్యాపారం చేస్తూ లక్షల కోట్లు లాభపడుతున్నా తన అజమాయిషీ మాత్రం వదలుకోవటం లేదు. ఇండియా భూభాగంలో జరిగే అంశాల మీద కూడా తన ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తోంది!

 

టిబెట్ బౌద్ధుల మత గురువు దలైలామా మన దేశంలో ఎప్పట్నుంచో ఆశ్రయం పొందుతున్నారు. అమెరికాతో సహా చాలా దేశాలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. ఆయన టిబెట్ ప్రజలకు చైనా పాలన నుంచి విముక్తి కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో శతాబ్దాలు స్వతంత్రంగా బ్రతికిన టిబెట్ ఇప్పుడు డ్రాగన్ రాక్షస హస్తాల్లో బందీ అయిపోయింది. ఆ విషయాన్ని భారత్ దలైలామా సాయంతో ఎక్కడో అంతర్జాతీయ గొడవగా మారుస్తోందనని చైనా భయం! అందుకే, వీలు చిక్కినప్పుడల్లా తాటాకు చప్పుళ్లకు తెగబడుతుంటుంది!

 

ఇప్పటి వరకూ మనం ఓడిన ఒకే ఒక్క యుద్ధం చైనాతో చేసిందే. అందుకే, గత పాలకులు బీజింగ్ బెదిరింపులకు ఎప్పుడూ తలవగ్గుతూనే వచ్చారు. ఆ క్రమంలోనే దలైలామ మన దేశంలో వుంటున్నా ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి కదలాలి అన్నది చైనానే నిర్ణయిస్తుంటుంది. బీహార్లోని బౌద్ధ క్షేత్రాల మొదలు అరుణాచల్ ప్రదేశ్ వరకూ ఎక్కడా దలైలామ సంచరించకూడదని చైనా ఉద్దేశం!

 

దశాబ్దాలుగా చైనీస్ దాదాగిరి నడిచినా.. మోదీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చింది. అదీగాక వివాదాస్పద ప్రాంతమని చైనా చెప్పుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం బీజేపి ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటి నుంచి చైనీస్ కమ్యూనిస్ట్ పాలకుల భయం మరింత ఎక్కువైంది. అందుకే, దలైలామ అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారని అనగానే నానా యాగీ చేసింది బీజింగ్. అయినా న్యూ ఢిల్లీ దూకుడుగా ముందుకు పోయింది. ఇలాంటి పరిణామం చైనా గతంలో ఎప్పుడూ చూడలేదు! అందుకే మొన్న మార్చ్ 17న బీహార్లోని రాజ్ గిర్ లో దలైలామ అంతర్జాతీయ బౌద్ధ సదస్సుకు హాజరైతే కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా ఇది మాకు ఎంత మాత్రం అంగీకారం కాదనీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలాగైతే సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది! 

 

పాక్ తో దోస్తీ చేస్తూ, ఐక్యరాజ్య సమితిలో వెనకేసుకొస్తూ , మసూద్ అజర్ లాంటి ఉగ్రవాదిని కాపాడుతూ డ్రాగన్ దలైలామా విషయంలో మాత్రం మనకు నీతులు చెబుతోంది. కోట్లాది మంది దేవుడుగా భావించే గురువుని మన దేశంలోని ఏయే ప్రాంతాల్లో తిరగాలో, తిరగవద్దో చైనా నిర్ణయించాలనుకోవటం అహంకారం తప్ప మరేం కాదు. మోదీ సర్కార్ ఇక మీదట కూడా డ్రాగన్ తో కఠినంగా ద్వైపాక్షిక క్రీడ ఆడాలి. చైనాకు దానికి తెలిసిన భాషలో సమాధానం ఇస్తే అర్థమవుతుంది.