దగ్గుబాటి దంపతులు బీజేపీలో చేరితే

 

దగ్గుబాటి దంపతులు బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవే నిజమయితే వారి వలన బీజేపీకి, బీజేపీ వలన వారికి ఊహించనంత ప్రయోజనం కలగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును. వారిరువురూ తెలుగుదేశంలో చేరినా అదేవిదమయిన ప్రయోజనం కలిగే అవకాశం ఉండేది. అయితే, ఈ ఎన్నికల తరువాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేఅవకాశాలునందున బీజేపీలోకి వెళ్ళడం వలననే వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. కేంద్రమంత్రిగా చేసిన పురందేశ్వరికి, ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగలిగితే ఆమెకు మళ్ళీ అంతకంటే మంచి కీలకమయిన పదవే దక్కవచ్చును. కానీ, బీజేపీ అధికారంలోకి రాకపోయినట్లయితే, వారి ఈ నిర్ణయం వారికి రాజకీయంగా చాలా నష్టం కలిగిస్తుంది. అయితే ఇంతవరకు వెలువడుతున్న సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా ఉన్నాయి గనుక వారు బీజేపీలో చేరాలనుకోవడం మంచి నిర్ణయమేనని భావించవచ్చును.

 

సీమాంధ్రలో బీజేపీని సమర్ధంగా ముందుకు తీసుకుపోగాల నాయకుడు కానీ, ప్రజలకు సుపరిచితమయిన మొహాలు కానీ లేకపోవడంతో ఇంతకాలం బీజేపీ ఉనికి నామమాత్రంగా ఉంది. రాష్ట్ర విభజన జరిగి, ఆంధ్ర తెలంగాణాలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడుతున్న ఈ సమయంలో బీజేపీ కూడా సీమాంధ్రకు ప్రత్యేక శాఖ ఏర్పరచడానికి సిద్దం అవుతోంది గనుక, ఒకవేళ దగ్గుబాటి దంపతులు బీజేపీలో చేరేందుకు సిద్దపడితే వారికి లోక్ సభ, శాసనసభ టికెట్స్ తో బాటు పురందేశ్వరికి సీమాంధ్ర పార్టీ పగ్గాలు అప్పగించినా ఆశ్చర్యం లేదు.

 

రాష్ట్ర విభజన బిల్లుకి బీజేపీ మద్దతు ఇచ్చిన కారణంగా ఇంతవరకు తెదేపా ఆ పార్టీతో పొత్తుల గురించి తన అభిప్రాయం చెప్పకుండా వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. ఒకవేళ ఆ రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తులు కుదుర్చుకొంటే, మిత్రపక్షమయిన బీజేపీలో దగ్గుబాటి దంపతులు చేరడం వలన తేదేపాకు ఎటువంటి సమస్య ఉండదు. కానీ, కాంగ్రెస్-వైకాపాల నోటికి భయపడి, సీమాంధ్రలో ప్రజాగ్రహానికి గురవుతామనే భయంతోను ఒకవేళ తెదేపా బీజేపీతో పొత్తులు పెట్టుకొనేందుకు వెనుకాడితే, అప్పుడు పురందేశ్వరి రాకతో బలపడిన బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద సవాలుగా మారడం ఖాయం. అందువల్ల దగ్గుబాటి దంపతులు తెదేపా, బీజేపీలలో ఏ పార్టీలో చేరుతారనే అంశం కూడా ఆ రెండు పార్టీలను తీవ్ర ప్రభావితం చేయనుంది.