టీడీపీలోకి కొడుకును పంపుతున్న పురంధేశ్వరి..?

ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరికి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఉన్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. తన తండ్రిని గద్దె దించి.. ఆ పీఠాన్ని చంద్రబాబు చేజిక్కించుకున్నారనే.. అసంతృప్తితో బయటకు వెళ్లిపోయారు దగ్గుబాటి దంపతులు. చంద్రబాబును ఎదిరించలేక.. కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ జంట కాంగ్రెస్‌లో చేరింది. ఎంపీగా, కేంద్రమంత్రిగా పురంధేశ్వరి.. పర్చూరు ఎమ్మెల్యేగా దగ్గుబాటి వెంకటేశ్వరరావుల హవా కాంగ్రెస్‌లో బాగానే నడిచింది.  రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ భవిష్యత్తు కోసం.. తండ్రి స్థాపించిన టీడీపీలోకి రీఎంట్రీ ఇద్దామని పురంధేశ్వరి భావించారు. అయితే బాబు ఇందుకు ససేమిరా అన్నారు.. బీజేపీలో చేరి బెజవాడ ఎంపీ సీటును ఆశించినప్పటికీ.. దానికి చంద్రబాబు అడ్డు చెప్పారని ప్రచారం జరిగింది.

 

కమలదళంలో పురంధేశ్వరి హవా నడవకపోవడంతో ఆమె టీడీపీలో చేరుతారని కూడా వార్తలు వచ్చాయి. కానీ వీటిలో వాస్తవం లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె కొత్త ఎత్తు వేశారు.. తన కొడుకు చెంచురామ్‌ను తెలుగుదేశంలోకి పంపాలని ఆమె భావిస్తున్నారట. తమ్ముడు బాలకృష్ణ ద్వారా పురంధేశ్వరి తెరవెనుక నుంచి.. ఈ వ్యవహారం నడుపుతున్నట్లు పొలిటికల్ టాక్. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం మొదటి నుంచి దగ్గుబాటి కుటుంబానికి అడ్డా.. 1985, 89, 2004, 2009లలో ఆ నియోజకవర్గం నుంచి దగ్గుబాటి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా సామాజిక వర్గ సమీకరణలతో టికెట్ దక్కలేదు. ఈలోగా రాష్ట్ర విభజన జరగడం.. కాంగ్రెస్‌ను జనం చీదరించుకోవడంతో ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు వెంకటేశ్వరరావు.

 

2014లో టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు గెలుపొందారు.. అయితే ఆయన పనితీరుపై స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో.. ఏలూరిని పోటీ నుంచి తప్పించాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో టీడీపీలో ఎలాగైనా క్రీయాశీలకంగా వ్యవహరించాలని భావిస్తున్న దగ్గుబాటి కుటుంబం.. కుమారుడు చెంచురామ్‌ను ఇక్కడి నుంచి బరిలోకి దించాలని పావులు కదుపుతున్నట్లు పొలిటికల్ టాక్.

 

ఎట్టి పరిస్ధితుల్లోనూ టిక్కెట్ మేనల్లుడికి దక్కేలా చేయాలని బాలయ్య పట్టుదలతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు, లోకేశ్‌ల వద్ద ఈ విషయాన్ని బాలయ్య ప్రస్తావించినట్లు.. దీనికి వారిద్దరూ సానుకూలంగా స్పందించినట్లు పచ్చ కండువాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరోవైపు పురంధేశ్వరితో జట్టుకట్టి టీడీపీపై విరుచుకుపడుతున్న నందమూరి హరికృష్ణకు.. అదే పురందేశ్వరితో చెక్ పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నారట. రాజకీయంగా.. వ్యక్తిగతంగా అన్ని రకాలుగా లాభం చేకూర్చే ఈ సువర్ణవకాశాన్ని టీడీపీ అధినేత వదులుకోరని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి ఎలాంటి స్టెప్ వేస్తారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.