మెదడుకి దెబ్బ తగిలితే ఇక CT SCAN అక్కర్లేదు

 

మనుషులన్నాక దెబ్బలు సహజం. పిల్లవాడు ఆడుకుంటూ తల బొప్పి కట్టించుకున్నా, పెద్దవాళ్లు బండి మీద నుంచి జారిపడినా... ఒంటి మీద దెబ్బ పడకుండా జీవితాన్ని ఈదలేం. కాకపోతే తల మీద దెబ్బ తగిలితే ఆ అనుమానమే వేరబ్బా! ఆ దెబ్బ వల్ల మెదడులో ఏదన్నా బ్లడ్‌ క్లాట్‌ అయిందేమో అని మనసు ఒకటే పీకుతూ ఉంటుంది. ఇక ఆ అనుమానాన్ని క్యాష్‌ చేసుకునేందుకు మన హాస్పిటల్స్ ఎలాగూ సిద్ధంగా ఉంటాయి. మెదడుకి కాస్త దెబ్బ తగిలి కళ్లు బైర్లు కమ్మాయని చెప్పగానే వెంటనే CT SCAN తీయించుకోమని భయపెడతారు డాక్టర్లు.

 

సీటీ స్కాన్ అంటే మాటలా! అది ఎక్కడ పడితే అక్కడ ఉండదు. దాన్ని ఏర్పాటు చేసుకున్న హాస్పిటల్స్ దగ్గరకి వెళ్లి తెగ నిరీక్షించాలి. ఆపై వేలకి వేలు ఫీజులు కట్టాలి. సీటీ స్కాన్ మిషన్ వల్ల వెలువడే రేడియేషన్‌కి మన శరీరాన్ని అప్పగించాలి. ఇంత చేసిన తర్వాత రిపోర్టు ఎలా వస్తుందో అని దేవుడికి తెగ మొక్కాలి. మరి ఈ హడావుడి అంతా లేకుండా సింపుల్‌గా ఒకే ఒక్క రక్తపు చుక్కతో మన మెదడులో ఉన్న పరిస్థితిని తెలుసుకోగలిగితే ఎంత బాగుండో కదా!

 

ఇదే ఆలోచన వచ్చింది జెనీవాలో కొంతమంది శాస్త్రవేత్తలకి. మన శరీరంలో ఏదన్నా తేడా జరిగినప్పుడు రక్తప్రసారంలో కొన్ని మార్పులు వస్తాయి. కొన్ని ప్రొటీన్లు ఎక్కువగానో తక్కువగా స్రవిస్తాయి. వీటిని బయోమార్కర్స్ అంటారు. మెదడుకి దెబ్బ తగిలినప్పుడు కూడా ఇలాంటి బయోమార్కర్స్‌ ఏవన్నా విడుదల అవుతాయేమో కనుక్కుందామని ప్రయత్నించారు ఆ శాస్త్రవేత్తలు.

 

మెదడుకి దెబ్బ తగిలినప్పుడు అక్కడ ఉన్న కణాలు ఏవన్నా దెబ్బ తింటే H-FABP అనే ప్రొటీను రక్తంలోకి ఎక్కువగా విడుదల అవుతుందని తెలిసింది. ఒక మిల్లీలీటరు రక్తంలో 2.5 కంటే ఎక్కువగా H-FABP ఉంటే లోపల ఏదో జరిగి ఉంటుందని అనుమానించవచ్చు. అప్పుడే మిగతా పరిక్షల జోలికి వెళ్లవచ్చని తేల్చారు. ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఎలాగైతే యూరిన్‌ శాంపిల్‌ ఉపయోగిస్తామో... అలాగే H-FABP ప్రొటీన్‌ ఎంత ఉందో తెలుసుకునేందుకు ఒక చిన్న స్ట్రిప్‌ మీద రక్తపు బొట్టు వేస్తే సరిపోతుందట.

 

సాధారణంగా ఇలాంటి పరిశోధనలు వినడానికి బాగానే ఉంటాయి కానీ మార్కెట్లోకి రావడానికి చాలాకాలం పడుతుంది. కానీ ఈ స్ట్రిప్‌ని మాత్రం వచ్చే ఏడాది నుంచి జనాలకి అందుబాటులో ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

- నిర్జర.