ఆయన వాళ్లకు 5ఏళ్లు… ఆయనకి వాళ్లు 6నెలలు… శిక్షలు విధించుకున్నారు!

పైకి ఎవ్వరూ దూకుడుగా విమర్శించనప్పటికీ మన న్యాయ వ్యవస్థపై చాలా మందికి అనుమానాలు, అసహనాలు వున్నాయి. అంతే కాదు, ఒక కోర్టు ఇచ్చిన తీర్పును మరో కోర్టు కొట్టేయటం, ఆ కోర్టు ఇచ్చింది మళ్లీ సుప్రీమ్ వ్యతిరేకించటం… ఇలా జరుగుతుంటుంది. దీనిపై కూడా అనేక మంది అనేక విధాల స్పందిస్తుంటారు. అయితే, న్యాయమూర్తుల తీర్పుల్ని పరిధికి మించి విమర్శించే హక్కు లేదు కాబట్టి సాధారణ సందర్భాల్లో అందరూ మౌనంగానే వుండిపోతుంటారు. ఇక ఇప్పుడు సాక్షాత్తూ ప్రధాన న్యాయమూర్తులే ఒకరికి ఒకరు శిక్షలు వేసుకుంటూ న్యాయ వ్యవస్థని అభాసుపాలు చేస్తున్నారు. జనంలో వున్న అనుమానాలు, అపనమ్మకాలు మరింత పెరిగేలా ప్రవర్తిస్తున్నారు!

 

జస్టిస్ కర్ణన్ కోల్ కతా హై కోర్ట్ లో న్యాయమూర్తి. ఆయన ఏం చేశారో తెలుసా? ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఖేహర్ కి, మరో ఏడుగురు న్యాయమూర్తులకి ఐదేళ్ల కఠిన కారాగారా శిక్ష విధించాడు! వాళ్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నేరస్థులంటూ లక్ష రూపాయల చొప్పున జరిమానా కూడా విధించాడు. అది కట్టకపోతే మరో ఆరు నెలలు జైల్లో వుండాలంటూ ఆదేశించాడు! వింటుంటేనే విడ్డూరంగా వున్న ఈ ఉదంతం చాలా రోజులుగా రాజుకుంటున్న నిప్పుకి అంతిమ ఫలితం. జస్టిస్ కర్ణన్ గతంలో మద్రాస్ హైకోర్ట్ లో న్యాయమూర్తిగా పని చేశారు. అప్పట్నుంచీ ఆయన ప్రవర్తన వివాదాస్పదంగా వుంటూనే వస్తోంది. ఇక కోల్ కతా హైకోర్ట్ కి ట్రాన్స్ ఫర్ అయ్యాక ఆయన ఆరోపణలు మరీ శృతీ మించాయి. తాను దళితుడ్ని కాబట్టే తనని ఇతర జడ్జీలు అవమానిస్తున్నారని, తగిన విధంగా ప్రమోషన్లు రావటం లేదని ఆరోపిస్తూ వచ్చారు. ఆయన సుప్రీమ్ కోర్టు చీఫ్ జస్టిస్ ను కూడా వదలకుండా విమర్శలు చేశారు!

 

జస్టిస్ కర్ణన్ సుప్రీమ్ లో విచారణకు హాజరు కావాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశిస్తే అందుకు కూడా ససేమీరా అన్నారు కర్ణన్. పైగా అత్యున్నత న్యాయస్థానం ఆయన ఎలాంటి కేసు విచారణలు చేయకూడదని ఆదేశించాక కూడా ఎనిమిది మంది జడ్జీలకు శిక్షలు వేశాడు. ఇక జస్టిస్ కర్ణన్ అసాధారణ ప్రవర్తనను సీరియస్ గా తీసుకున్న సుప్రీమ్ తాజాగా ఆయన ఆరు నెలల జైలు శిక్ష విధించింది. జూన్ 11న రిటైర్ కానున్న కర్ణాన్ పదవిలో వుండగా జైలు పాలైన తొలి భారతీయ జడ్జీగా చరిత్రలో మిగలనున్నాడు!

 

అసలు జస్టిస్ కర్ణన్ దళిత కులానికి సంబంధించిన ఆరోపణలు సహేతుకమైనవా? కావా? ఆయన మానసిక స్థితి ఏంటి? అలాగే, సుప్రీమ్ కోర్టు జడ్జీల తీర్పు సరైందేనా? న్యాయమూర్తిగా వున్న కర్ణన్ ను జైలుకి పంపటం సబబా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇప్పుడు ఎవరి వద్దా సమాధానం లేదు. కాకపోతే, సామాన్య జనానికి మాత్రం దేశంలోని అత్యున్నత గౌరవ ప్రదమైన న్యాయమూర్తుల స్థానంలో వుండి …. వీరంతా ఇలా పరస్పర శిక్షలు వేసుకోటం ఆశ్చర్యం కలిగిస్తోంది! పేదలు, బలహీనులు తమకు న్యాయం జరుగుతుందని కోర్టుల్ని ఆశ్రయిస్తారు. అలాంటిది ఆ వ్యవస్థలోనే ఇంతగా అరాచకం వుంటే ఇక విశ్వాసం నిలిచేదెలా? ఇప్పుడే ఇదే అతి పెద్ద ప్రశ్న!

 

కోర్టులు, న్యాయమూర్తులపై… ప్రజల్లో ప్రభుత్వాలు, నాయకులపై కన్నా కాస్త ఎక్కువే నమ్మకమే వుంది ఇప్పటికీ. కాని, జస్టిస్ కర్ణన్ కేసు లాంటి ఉదంతాలు ఎన్ని ఎక్కువ బయట పడితే అంతగా న్యాయ వ్యవస్థ పటుత్వం దెబ్బతినే ప్రమాదం వుంది. అందుకే, జడ్జీలు తమ వ్యవస్థలోని లోపాల్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు అమాంతం మొదలు పెట్టాలి. ప్రభుత్వం చేయగలిగింది ఏమైనా వుంటే సూచించాలి. అలా కాకుండా జడ్జీలే పరస్పర ఆరోపణలు చేసుకుని శిక్షలు వేసుకుంటే సామాన్య జనం న్యాయం కోసం కోర్టుల్ని ఆశ్రయించటం తగ్గిపోవచ్చు!