కిరణ్ కుమార్ రెడ్డి కెప్టెన్సీలో అజహరుద్దీన్!

 

ఒకనాడు కేవలం సినీపరిశ్రమకు చెందిన నటీనటులు మాత్రమే రాజకీయాలలో చేరేవారు. వారికి గల ప్రజాకర్షణే వారిని అందుకు ప్రోత్సహించేది. కానీ, నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయన్నట్లు, మారిన సామాజిక పరిస్థితుల్లో అన్ని రంగాలకు చెందిన వారు కూడా వివిధ కారణాలతో వివిధ రాజకీయపార్టీలలో ప్రవేశిస్తున్నారు. ఒకవిధంగా ఇది ఆహ్వానించదగ్గ శుభపరిణామమని చెప్పవచ్చును. వివిధ రంగాలపట్ల సరయిన అవగాహనలేని మన రాజకీయ నాయకులకు, వీరి చేరిక వలన ఆయా రంగాలలో ఉండే సమస్యల గురించి, వాటికి పరిష్కార మార్గాలు గురించి కొంత అవగాహన ఏర్పడుతుంది.

 

ఇక, అసలు కధలోకి వస్తే, ఒకనాటి మేటి క్రికెటర్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ మొరదాబాద్ పార్లమెంటు సభ్యుడు అయిన అజహారుద్దీన్ ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసారు. ఆ తరువాత అజాహారుద్దీన్ మీడియా వారితో మాట్లాడుతూ తను రాష్ట్ర రాజకీయాలలో చేరలనుకొంటున్నట్లు చెప్పారు. కానీ, ముఖ్యమంత్రిని మాత్రం 'ఆపని మీద' కలువలేదని కేవలం ఆయనను పలుకరించి వద్దామనే కలిశానని అన్నారు. మరో ప్రశ్నకు బదులిస్తూ, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మద్య ఏర్పడిన విబేధాల గురించి తనకు తెలియదని చెప్పారు. అజహారుద్దీన్ ‘కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని’ ఒక సర్టిఫికేట్ కూడా జారీ చేశారు.

 

మజ్లిస్ కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయిన తరువాత, ముస్లిం వర్గానికి చెందిన అజాహారుద్దీన్ వంటి ఒక ప్రసిద్దమయిన వ్యక్తి జాతీయ కాంగ్రెస్ నుండి రాష్ట్రీయ కాంగ్రెస్ వైపు చూడటం కిరణ్ కుమార్ రెడ్డి కి సంతోషం కలిగించే విషయం కాగా, మజ్లిస్ పార్టీని దూరం చేసుకొన్నరాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి సమయంలో చేరడంవల్లనే తనకు ఓ ప్రాముఖ్యత ఏర్పరడుతుందని ఆయన భావిన్చడం వల్లనే రాష్ట్ర రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నట్లు భావించవచ్చును. మజ్లిస్ తమను విడిచి వెళ్ళిపోయిన తరువాత, తమ పార్టీ రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంకు కొంత మేరయినా కోల్పోయమని అర్ధం చేసుకొన్నపటికీ, చేసుకొన్నరాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం రాజకీయాలలోచాలా సహజమయిన విషయమే.

 

ఇప్పుడు అజహారుద్దీన్ రాకవల్ల పోగొట్టుకొన్న ఆ ఓటు బ్యాంకును పూర్తిగా కాకపోయినా కొంతయినా కైవసం చేసుకోవచ్చునని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆలోచించడం అసహజమేమి కాదు. కాంగ్రెస్ పార్టీకి, ఆయన రాకవల్ల ఇప్పటికిప్పుడు ప్రత్యేక లాభం ఏమి లేకపోయినప్పటికీ, ఆయనను సాదరంగా ఆహ్వానించి వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇచ్చినట్లయితే, మంచి క్రికెట్ కామెంటర్ గా కూడా పేరు పొందిన ఆయన, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రచార కర్తగా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.

 

ఇక, ఇదంతా కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి జట్టులో అజహార్ ఆడేందుకు ‘టికెట్ ఖాయం’ అయిన తరువాత జరిగే కధ కనుక,అప్పటి వరకు అజహారుద్దీన్ ఎక్సట్రా బ్యాట్స్ మ్యాన్ గా గేలరీలో కూర్చొని కిరణ్ ఆడుతున్న గేం చూస్తూ శబాష్ బాగా ఆడుతున్నారని చప్పట్లు కొట్టుకొంటూ కూర్చోక తప్పదు.