కేరళ ఆరెస్సెస్ హత్యలు మీడియాకు ఎందుకు పట్టవు?

మన ఇండియన్ మీడియా తీరే విచిత్రం! నిజంగా ప్రపంచానికి ఏది పెద్ద సమస్యో దాన్ని మన మీడియా నెత్తికెత్తుకోదు. తనకు ఏది పెద్ద సమస్యో దాన్నే జనం నెత్తిన రుద్దుతుంది. మరీ ముఖ్యంగా, జాతీయ మీడియాగా చెప్పుకుని తిరిగే ఇంగ్లీష్ మీడియా తన ఇష్టానుసారం అంశాల్ని హైలైట్ చేస్తుంది! ఏ ఈశాన్య భారతంలోనో, దక్షిణ భారతంలోనో మర్డర్ జరిగినా వారికి పట్టదు. కాని, ఢిల్లీలో, ముంబైలో ఇంకు దాడి జరిగినా, చెప్పులు విసిరేసినా... రోజంతా పండగే! ఇప్పుడు మరోసారి అదే తత్వం నిరూపించుకుంటోంది మన మీడియా... 

 


కేవలం కొన్ని గంటల క్రితం మధ్యప్రదేశ్ లో ఒక ఆరెస్సెస్ నాయకుడు ఏమన్నాడో తెలుసా? ఇంగ్లీష్ మీడియా అదే పనిగా ఆయన మాటల్ని ఉదరగొట్టింది. ఎవరైనా కేరళ సీఎం విజయన్ తల నరికి తెస్తే తాను వారికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించాడు! ఆ ఉన్మాదపు మాటలు ఊరికే ఆవేశంగా అన్నవేనని ప్రత్యేకంగా చెప్పాలా? అందులో సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం ఏమైనా వుందా? ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఏం లేడు. ఆయన చేతిలో ఆర్మీనో, పోలీస్ వ్యవస్థో లేదు. కనీసం ఆరెస్సెస్ కి కూడా ఆయన సుప్రీమ్ బాస్ ఏం కాదు. అలాంటి ఎవరో ఒక ఆరెస్సెస్ నేత కేరళ సీఎం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే... మన ఛానల్స్ గోలగోల చేశాయి! 

 


మీడియాని తప్పుబడుతున్నాం అంటే ఆరెస్సెస్ నేత కోటి రూపాయలు ఇస్తాననటం కరెక్ట్ అని చెప్పటం కాదు. అది తప్పే. కాని, ఆయన ఎందుకు అలా అనాల్సి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం వెదికితే మన మీడియా నిర్లక్ష్యం స్పస్టంగా బయటపడుతుంది! కేరళలో గత కొన్ని సంవత్సరాలుగా ఆరెస్సెస్, బీజేపి నేతల హత్యలు నిరాటంకంగా , నిర్లజ్జగా జరిగిపోతున్నాయి. కేరళ సీఎం విజయన్ జిల్లాలోనే పదుల సంఖ్యలో కాషాయ కార్యకర్తలు దారుణ హత్యలకి గురయ్యారు. ఎంతో మంది చేతులు, కాళ్లు నరికేస్తున్నారు. ఎవరు? ఇంకెవరు, అక్కడి సీపీఎం శ్రేణులే! ఇది అక్కడ పబ్లిక్ సీక్రెట్! అందరికీ తెలిసినా ఎవ్వరూ పట్టించుకోని విషయం... 

 


సంవత్సరాల తరబడి తన ఆధీనంలో వున్న శాంతిభద్రతల అంశాన్ని కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా కొత్త సీఎం విజయన్ వచ్చాక మరింత పెరిగాయి రాజకీయ హత్యలు. ఇదంతా జరుగుతోంటే మన మీడియా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంత సేపూ ఢిల్లీలో గుర్ మెహర్ కౌర్ పై ట్విట్టర్ లో దాడి చేయటం తప్పని చెప్పటంలోనే మన ఛానల్స్ బిజీ! ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్, బీఫ్ తినటం, అసహనం, అవార్డ్ వాప్సీ... ఇవే ఇంగ్లీషు మీడియాకు పల్లీబఠాన! అంతే తప్ప కేరళలో, బెంగాల్ లో ఆరెస్సెస్, బీజేపి నేతల హత్యలు పట్టించుకునే టైం వుండటం లేదు! కాని, అదే సమయంలో ఒక ఆరెస్సెస్ నేత విజయన్ తల నరకమని ఆవేశంగా అంటే మాత్రం అందరూ అలెర్ట్ అయిపోతారు! ఈ వివక్ష ధోరణి అత్యంత ప్రమాదకరం... నిజంగా కేరళలో జరగుతున్నవి రాజకీయ హత్యలేనా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు అర్జెంట్ గా తెలుసుకోవాలి. ఆ బాధ్యత కేరళ రాష్ట్ర ప్రభుత్వానిది.