మనోవేదనతో నక్సలైటుగా మారతానని లేఖ రాస్తే.. నీ అంతు చూస్తామని బెదిరిస్తారా?

అధికార పార్టీకి చెందిన నాయకుడి ఇసుక లారీని అడ్డుకున్నందుకు.. గత నెల 18న తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్‌ లో దళిత యువకుడైన ప్రసాద్ కు పోలీసులు శిరోముండనం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై ఏపీలో తీవ్ర దుమారం రేగింది. దళిత సంఘాలు, విపక్షాలు అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

 

అయితే ఈ ఘటనలో తనకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన చెందిన బాధితుడు ప్రసాద్ ఇటీవల భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కి లేఖ రాశాడు. "ఇక్కడ నాకు ఎవరూ న్యాయం చేయడంలేదు. నక్సలైట్లలో చేరి నా పరువు కాపాడుకుంటాను. నాకు అనుమతి ఇప్పించండి." అని లేఖలో పేర్కొన్నాడు. దీంతో ఈ ఘటనపై రాష్ట్రపతి సీరియస్ గా స్పందించారు. ఈ మొత్తం ఘటనపై విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు.

 

ఇదిలా ఉంటే తనకి న్యాయం జరగడం లేదంటూ తీవ్ర ఆవేదనతో రాష్ట్రపతికి లేఖ రాసిన దళిత యువకుడు ప్రసాద్ పై.. ఏపీ మంత్రి పినిపె విశ్వరూప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్లలో చేరాలంటే ఎవరైనా వెళ్లి చేరవచ్చని అన్నారు. "నక్సలైట్లలో చేరతా అనుమతించండంటూ రాష్ట్రపతికి లేఖ రాశారట. దీనికి రాష్ట్రపతి అనుమతి అవసరంలేదు. వెళ్లి చేరవచ్చు కదా. నక్సలైట్ అని ముద్రపడిన తర్వాత చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు" అని మంత్రి వ్యాఖ్యానించారు.

 

కాగా, మంత్రి విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యాయం జరగట్లేదన్న మనోవేదనతో ఆ యువకుడు నక్సలైటుగా మారతానని రాష్ట్రపతికి లేఖ రాస్తే.. ఆ యువకుడికి న్యాయం చేయకపోగా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని పలువురు తప్పుబడుతున్నారు.

 

మంత్రి విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోవేదనతో ఆ యువకుడు నక్సలైటుగా మారతానని రాష్ట్రపతికి లేఖ రాశాడని.. మంత్రి స్థానంలో ఉన్న విశ్వరూప్ బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సలైటుగా చేరితే నీ అంతు చూస్తామని బెదిరిస్తారా మీరు పాలకులా? ప్రజల పాలిట భక్షకులా? అని ప్రశ్నించారు. శిరోముండనం ఘటనతో సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయకుండా ప్రభుత్వం దోబూచులాట ఆడుతుందని మండిపడ్డారు. దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడతామని రామకృష్ణ తెలిపారు.