రాజధానిని ఎవరూ మార్చలేరు.. జగన్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

 

ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా రాజధాని గురించే చర్చ జరుగుతోంది. ఏపీ రాజధానిగా అమరావతి ఎంపిక సరైన నిర్ణయం కాదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ రాజధాని రగడ.. రోజురోజుకి రాజుకుంటుంది. వైఎస్ జగన్ సర్కార్ రాజధానిని మార్చే యోచనలో ఉందన్న ప్రచారం నేపథ్యంలో.. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

అయితే ఈ రాజధాని రగడ అంశంపై సీపీఐ సీనియర్ నేత నారాయణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. గత ఏడాది సైకిల్ పై రాజధాని ప్రాంతంలో పర్యటించిన సంగతిని గుర్తు చేసుకుంటూ.. ప్రస్తుత రగడపై స్పందించారు.

"ఊరులో ఇల్లు లేదు, ఊరుబయట చేనులేదు.. నీకెందుకురా పెత్తనం అని రాయలసీమ భూస్వాములు మాట్లాడ్తుంటారు. అలావుంది రాజధాని రగడ. అమరావతి రాజధానిని ఎవరూ మార్చలేరు, కాకపోతే సమయానుకూలంగా కాలాక్షేపం కొరకు చదరంగం ఆడుతున్నారు. దాదాపు సంవత్సరం క్రితం సీపీఐ జాతీయ సమావేశాలు విజయవాడలో జరిగాయి. సమావేశాలు అయిపోయిన మరుసటి రొజు కృష్ణ బ్యారేజ్ వద్దనున్న స్విమ్మింగ్ పూల్ వద్దకు నేను నామిత్రులు వెళ్ళాం. అక్కడ సైకిల్స్ కనబడ్డాయి. వాకింగ్ బదులు ఈమద్య సైకిల్స్ వాడుతున్నామని నామిత్రులు చెప్పారు. అయితే ఈరోజు సైకళ్ళస్వారి చేద్దామనుకుని సైక్లింగ్ చేశాము. పనిలోపనిగా రాజధాని వరకు వెళ్దాం అనుకుని బయలుదేరాము. మంచి విశాలమయిన రోడ్స్ కొంతవేశారు. యింకా నిర్మాణం కొనసాగుతున్నది. ప్రధానంగా మౌలిక సదుపాయం అవసరం. అదిలేనిదే భవననిర్మాణాలుగాని, కార్యాలయాలుగాని నిర్మిచలేం. ఉపరితల నిర్మాణాలకన్నా, పునాదుల నిర్మాణం, దానికన్నా ముందు సమగ్ర పథకానికే ఎక్కువ సమయం పడ్తుంది. పథకం లేకుండా హడావుడి పనుల వలన ప్రయోజనం శూన్యం. ఆ విషయంలో టీడీపీ ప్రభుత్వం పక్కాగానే ప్లాన్ చేసింది. అయితే రాజధాని నిర్మాణాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకొస్తాం అని, సీఎం ఉత్తర ప్రగల్బాలు పలికే నెత్తికి తెచ్చుకున్నారు. మింగ మెతుకులేకపోయినా మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు, చేతిలో పైసాలేకపోయినా ఆకాశానికి నిచ్చెనేశారు. అయినా జయప్రదం అయివుండేవాడేమో ప్రధాని మోడీ సహకరించి వుంటే. మోడీ గారికి రాజకీయలక్షణాలుంటే అదిజరిగేదే. మోడీ గారు చంద్రబాబుని అంత ఈజీగా మర్చిపోతాడా? మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన మారణ కాండ అమెరికా మొదలు యావత్ ప్రజానీకం ఖండించింది. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు కూడా మోడీని వ్యతిరేకించాడు. రాజకీయాలలోగాని వ్యక్తిగతంగా కానీ శత్రుశేషాన్ని భరించి, ధరించే వారుకాదు మోడీజి. ఆంధ్రప్రజలేమయినా కానీ చంద్రబాబును రాజకీయంగా బ్రతకనివ్వకూడదని నిర్ణయించుకున్నారు. "రాష్ట్ర హక్కులపై రాజకీయపోరాటం చేయమని సలహాయిస్తే" మీరెపుడూ అరచేవాళ్ళేకదా అరుచుకోండి నేను ఏదోక విధంగా అభివృద్ధికి పనిచేస్తానని వెటకారం చేసారు మమ్మల్ని. "కర్ణుడి చావుకు నూరు కారణాలన్నట్టు" టీడీపీ ఓడిపోయింది.

యువనేత జగన్ మోహన్ రెడ్డి  సీఎంగా ఎన్నిక కావడం, సంవత్సరం లోపు మంచి సీఎంగా నిరూపించుకుంటానని ఆత్మధైర్యంతో ప్రకటించారు. డైనమిక్ సీఎంగా ఊగిసలాట లేకుండా నిర్ణయాలు తీసుకుంటే మంచిదేనని నేను కూడా కితాబిచ్చాను. కానీ ప్రారంభంలోనే ప్రజావేదికను నేలమట్టం చేశారు. అదిప్రభుత్వ ఆస్తి ,చట్టవిరుద్దంగా కట్టివుంటే దాన్ని సీజ్ చేసి, కార్యకలాపాలు నిషేదించి ఉండవచ్చు. అలాంటి అక్రమ నిర్మాణం ప్రభుత్వానిదయినా, ప్రైవేట్ వాళ్ళదయినా ఒక విధానం ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇప్పుడేమైంది? ప్రభుత్వ ఆస్తి మట్టిపాలయింది. మిగతావన్నీ ఆలాగేవున్నాయిగదా.

"తెలంగాణ సీఎం ప్రారంభంలోనే అయ్యప్పసొసైటి లో అప్పటికే నిర్మించుకుని ఉన్న కట్టడాలను కూల్చప్రారంభించారు. నేను, సీపీఐ కార్యదర్శి చాడవెంకట్ రెడ్డి, పల్లవెంకటరెడ్డి వెళ్ళి అభ్యంతరం తెలియజేసి బాదితులకు అండగానిబడ్డాం. అప్పుడు కేసీఆర్ మమ్మల్ని ఆహ్వానించి, అయ్యప్ప సొసైటీ అంతా రాయలసీమ, రాజశేఖరెడ్డి గుంపే ఆక్రమిచుకున్నారన్నా, మీరెందుకు అక్కడపొయి అటకిస్తారు? అన్నారు. మీరుచెప్పింది వాస్తవం కాదు, అయినా నిర్మాణభవనాలను కూల్చితే జాతీయసంపద వృధా కదా అన్నాము.

గీతను చెరపడంకాదు, పెద్దగీతను గీయడానికి ప్రయత్నించాలి. గతప్రభుత్వ విధానాలను బహిర్గతం చేయాలంటే, బండగా వ్యతిరేకించడం గాక ప్రస్తుత ముఖ్యమంత్రి మంచిపనులు చేయడం ద్వారా గతప్రభుత్వ లోపాలను ప్రజలే తెలుసుకునేట్టు చేయాలి. గతపనులలో లోపాలుంటే వెలికితీయడం లో తప్పులేదు, అయితే కొనసాగే పనులు ఆపించడం వ్యతిరేకదొరణి.

పోలవరం ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకమయింది. ఇప్పటికే నేరపూరిత కాలయాపన జరిగిపోయింది. రివర్స్ టెండర్ పేరుతో పోలవరం పనులు అపించారు. కొత్త టెండర్ల కొరకు ప్రయత్నాలు, దానిలో ఎన్ని సాదకబాదలుంటాయో అనుభవిస్తేగాని తెలియదు. పోలవరం పనులు ఆపించకుండా, దానిలోవున్న అవినీతిని బహిర్గతం చేయడానికి, నిరూపించడానికి తగిన ప్రయత్నం చేసి వుంటే అపుడు తగినచర్యకు అవకాశం వుండేదికదా.

అమరావతి రాజధాని ప్రస్తావన లేనపుడే, ఉమ్మడి రాష్ట్రం లో రెండుమూడేండ్లు వరుసగా వరదలు వచ్చినపుడు ఉండవల్లి చుట్టుపక్కగ్రామాలలో విలువయిన ఉల్లి, తదితర కూరగాయల పంటలు నీటిలో మునిగి పంటనష్టం వచ్చింది. నేనే స్వయంగా పరిశీలనకువెళ్ళాను. కొండవీటి వాగు ప్రవాహం వలన ముంపుకు గురై పంటనష్టం వస్తుందని, ఆ ప్రవాహాన్ని కృష్ణ రివర్ కు మళ్ళిస్తే మంచిదని సూచించడం జరిగింది. రాజధాని నిర్మాణం లో ఇదంతా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు రాజదానిపై అంతచర్చ అవసరమా లేక పక్కదారిపట్టించడానికా?.

నేను, మా మిత్ర బృందం సైకిళ్ళపై తిరిగినపుడు నవ్వులూరు మొదలు రాజధాని పరిసర గ్రామాలకు వెళ్ళాము. స్థానికులతో కలిశాము. అంతా సంతృప్తి వ్యక్తపరిచారు. చిన్న చిన్న లోపాలుండవా అంటే వుంటాయి. అది పరిష్కారం కానిది మాత్రం కాదు.

నూతన ముఖ్యమంత్రి కేవలం చంద్రబాబును ద్రుష్టిలో పెట్టుకునే అడుగులువేయడమంటే అది తప్పుటడుగులే అవుతుంది. ఒకసారి నా ఉపన్యాసం విన్న ఓ సైకాలజిస్టు నాతో చెప్పినమాట "నీప్రత్యర్ధి బీజేపీని గురుంచి నూరు మార్లు మాట్లాడి, మీ పార్టి నిగురుంచి పదిమార్లు మాత్రమే మాట్లాడావు. ఒక విధంగా నీవే ప్రత్యర్ది పార్టీకి ప్రచారకర్తగా నీకు తెలియకనే మారిపోయావు అన్నాడు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిది కూడా ఇదే తంతు . " ఆపెద్దమనిషి , సిగ్గులేని చంద్రబాబు" అని పదేపదే వుటకించడంద్వారా, ఈప్రభుత్వం చేసే సానుకూల పనులు స్థానే, ప్రత్యర్దులను గురించి కాలం వృధా చేసుకుంటున్నాడు.

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో చంద్రబాబునుద్దేశించి ఏకవచనం వాడేవారు. అపుడు సినీ నటులు పచ్చిపులుసు సుబ్రమణ్యం " చంద్రబాబును ఏకవచనంతో సంబోదించకండి సార్" అని సలహా ఇచ్చారు. దానికి వైఎస్సార్ యెందుకు? అలానే అంటాను అని వెళ్ళారు. కానీ ఆ మరునాడు నుండి వైఎస్సార్ వైఖరిలో మార్పుకనపడింది. " ఎంత ఎదిగితే అంతవొదిగి వుండడం" ఉత్తమం. కానీ జగన్ లో దూకుడేతప్ప హుందా తనం లేదు." అంటూ నారాయణ తన గత అనుభవాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ వైఖరిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.