మూడు సీట్లకు ఓకే చెప్పిన సీపీఐ.. కూటమికి సై

 

సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలమీద చర్చలు జరుపుతూ ఇన్నిరోజులు జాప్యం చేసిన కూటమి ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ పార్టీలు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసాయి. ఇదే ఫ్లోలో టీజేఎస్, సీపీఐ అభ్యర్థులను ప్రకటించడానికి సిద్ధమయ్యాయి. ఇన్నిరోజులు సీపీఐ 5 స్థానాలకు పట్టుబట్టింది. అయితే కాంగ్రెస్ మాత్రం మూడు స్థానాలు కేటాయిస్తామని చెప్పింది. దీంతో అసలు కూటమిలో సీపీఐ కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. టీఆర్ఎస్ ని ఓడించడమే తమ లక్ష్యమని కూటమిలోని పార్టీలు రుజువు చేసాయి. మూడు స్థానాల్లో పోటీ చేసేందుకు సీపీఐ అంగీకారం తెలిపింది. సీట్ల సంఖ్యపై పార్టీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో పొత్తుకు సీపీఐ కేంద్ర కమిటీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. దీనిపై ఈరోజు పార్టీ అధికారికంగా ప్రకటన చేయనుంది. హుస్నాబాద్ నుంచి చాడ వెంకట్‌రెడ్డి, వైరా నుంచి విజయ పోటీ ఖరారు కాగా.. బెల్లంపల్లి అభ్యర్థిపై పార్టీలో సమాలోచనలు జరుగుతున్నాయి.