ఆవే అధికారానికి ఆధారం… అందుకే, ఆవుకో ఆధారం!

 

భారతదేశంలో ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైన పదం ఏదైనా వుందంటే… అది గోవే! గో అనే శబ్దం వినపడగానే అధికార పక్షం, ప్రతి పక్షం కత్తులు పైకెత్తి నిలుచుంటున్నారు! ఇందులో ఎవరి ఎజెండా వారిది. నిజంగా గో సంరక్షణ మీద ఎంత శ్రద్ధ ఎవరికుందో ఎవ్వరమూ చెప్పలేము! ఒకవైపు కాషాయ శక్తులు గోవులే ముఖ్యమంటుంటే… కాంగ్రెస్ , కమ్యూనిస్టు, ఇతర లౌకిక వర్గాలు మనుషుల కంటే ఆవులు ముఖ్యం కాదంటున్నాయి! ఇంత రచ్చకి కారణం ఇండియాలో ఆవు అన్ని జంతువుల్లాంటిది కాకపోవటమే. గోవు మనకు గోమాత. అందుకే, మతంతో ముడిపడిపోయి గో వధ నేరంగానే కాకుండా మహాపాతకంగా పరిగణించబడుతోంది. అది పాపమైనా ప్రతిపక్షాలు మోదీ సర్కార్ ని కార్నర్ చేసేందుకు గో వధని పదే పదే వాడుకుంటున్నాయి!

 

గోవుల విషయంలో తప్పెవరిదో చెప్పటం చాలా కష్టం. గోవుల అక్రమ రవాణ అడ్డుకోవటం కోసం బజరంగ్ దళ్, వీహెచ్ పీ, హిందూ వాహిని కార్యకర్తలు భౌతిక దాడులు చేయటం కొత్త కాదు. అది క్షమించరానిది కూడా. అయినా కూడా గో సంరక్షకుల చర్యలకి మరో కోణం వుంది. వాళ్లు రోడ్లపైకి వచ్చి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే దాకా ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగాలు పూర్తిగా నిర్లిప్తంగా వుంటూ వుంటాయి. భారతదేశంలోని మెజార్టీ మతస్థుల మనోభావాలకి సంబంధించిన గో వధ గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. ఓటు బ్యాంక్ వేటలో గో వధ నిషేధ చట్టం అమలు గాలికి వదిలేస్తుంటారు. దాన్నే బీజేపి క్యాష్ చేసుకుంటూ వుంటుంది. మొన్నటికి మొన్న యోగి ఆదిత్యానాథ్ అక్రమ కబేళాలు మూసి వేయించారు. అదే పని అఖిలేష్ ఎందుకు చేయలేదు? చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన తీరులో లౌకిక పార్టీలు వ్యవహరించనప్పుడే కాషాయ పార్టీలు, సంస్థలు రణరంగం చేసే అవకాశం లభిస్తూ వుంటుంది!

 

సుప్రీమ్ లో గోవుల అక్రమ రవాణ మీద నడుస్తోన్న ఒక కేసులో కేంద్రం ఆసక్తికర సమాచారం కోర్టుకు అందించింది. త్వరలో గోవులకి కూడా ఆధార్ లాంటి నెంబర్ ఇవ్వటం జరుగుతుందని చెప్పింది. ఇలాంటి ప్రయోగం ఇప్పటికే జార్ఖండ్ రాష్ట్రంలో విజయవంతంగా చేసి చూశారు కూడా. ఈ గో ఆధార్ నెంబర్ ఇవ్వటానికి గోవు వయస్సు, రంగు, కొమ్ముల తీరు, ప్రత్యేకమైన గుర్తింపు మచ్చలు వంటీ వాట్నీ పరిగణలోకి తీసుకుంటారు! అలాగే, గో అక్రమ రవాణ అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాలని కేంద్రం సూచించింది. ఎవ్వరూ పట్టించుకోని గోవుల, పశువుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి , నిధులు కేటాయించాలని అంటోంది!

 

గోవులకి ఆధార్ అనగానే గో వధని సమర్థించే ఆదర్శవాదులు జోక్ చేసే అవకాశాలే ఎక్కువ! కాని, ఇలాంటి ప్రత్యేక ఐడెంటిటి నెంబర్ జంతువులకి కేటాయించటం అనేది అమెరికా నుంచీ ఆస్ట్రేలియా దాకా చాలా దేశాల్లో వుంది. అది కేవలం పశువు అక్రమంగా తరలించకుండా వుంచేందుకు ఉపయోగపడే రిజిస్ట్రేషన్ నెంబర్ లాంటిదే! ప్రాణం లేని వాహనాలకే నెంబర్ వున్నప్పుడు కోట్లాది మంది దేవతగా భావించే గోవుకి వుంటే తప్పేం కాదు. అంతేకాక, గో ఆధార్ కారణంగా గో సంరక్షకుల దాడులు తగ్గుముఖం పడితే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. ఎక్కడా ఏ ఒక్క గోవు కిరాతకంగా చనిపోకూడదు. అంతకన్నా ప్రధానంగా గో సంరక్షణ జరిగే క్రమంలో ఏ ఒక్క మనిషీ హత్యకి గురికాకూడదు. గో ఆధార్ కారణంగా ఇది జరిగితే… కేంద్రం ఆలోచనని స్వాగతించాల్సిందే!