కోర్టు వాయిదాకొచ్చి రేప్ చేశాడు

ఒక కేసులో కోర్టు విచారణకు హాజరైన నిందితుడు తనపై కేసు పెట్టిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోరం జరిగింది మన హైదరాబాద్‌లోనే. బోడుప్పల్‌‌లోని హేమానగర్‌కు చెందిన యువతి కామారెడ్డి జిల్లాకు చెందిన ఇర్ఫాన్‌‌లు హైదరాబాద్ జెన్‌ప్యాక్ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ ప్రేమ పేరుతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని యువతి ఇర్ఫాన్‌ను కోరడంతో అతను ముఖం చాటేసి తన సొంతఊరికి వెళ్లిపోయాడు. దీంతో తాను మోసపోయినట్లు నిర్థారించుకున్న బాధితురాలు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. 2016లో ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుపై ఇప్పటికే వాయిదాలు నడుస్తున్నాయి. దీనిలో భాగంగా శనివారం కోర్టు వాయిదాకు వచ్చిన ఇర్పాన్‌ బాధితురాలితో నీతో మాట్లాడాలి అంటూ సదరు యువతి వెంట ఆమె ఇంటికి వెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె మళ్లీ పోలీసులను ఆశ్రయించింది.