గులాబీకి గుబులేనా! కమలం ఖాయమేనా! కాంగ్రెస్ కథేంటో?

కారుకు కౌంట్ డౌన్ మొదలైనట్టేనా? తెలంగాణలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోనున్నాయా? కాంగ్రెస్ ఫ్యూచరేంటీ? దుబ్బాక ఉప ఎన్నిక ఫలిత తర్వాత తెలంగాణ ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడిన దుబ్బాక ఉప ఎన్నికలో కమలం పార్టీ కత్తిలాంటి  విజయం సాధించింది. తెలంగాణలో తమకు తిరుగులేదని భావిస్తున్న కేసీఆర్ పార్టీకి చుక్కలు చూపించింది బీజేపీ. ఉప ఎన్నికలో అధికార పార్టీని ఓడించి సత్తా చాటింది. దుబ్బాక విజయంతో టీఆర్ఎస్ కు బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా మారింది బీజేపీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలపడే అవకాశం ఉంది. అదే జరిగితే కేసీఆర్ పార్టీకి కష్టాలు వచ్చినట్లేనని భావిస్తున్నారు. దుబ్బాక ఫలితంతో తెలంగాణ రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోనున్నాయని భావిస్తున్నారు. 

 

తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ అధికారంలో ఉంది. దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేత సోలిపేట రాంచంద్రారెడ్డి చనిపోయారు. సోలిపేట చనిపోవడంతో జరిగిన ఉప ఎన్నిక కాబట్టి సెంటిమెంట్ కూడా ఉంది. అంటే అధికారంతో పాటు సెంటిమెంట్ ఉన్నా ఉప ఎన్నికలో ఓడిపోవడం టీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాకే. అంతేకాదు సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో ఉంది దుబ్బాక నియోజకవర్గం. ప్రస్తుతం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ కు పక్క నియోజకవర్గమే. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, సిద్ధిపేట నియోజకవర్గాలు దుబ్బాకకు పక్కనే ఉన్నాయి. ఈ లెక్కన దుబ్బాక టీఆర్ఎస్ ముఖ్యనేతల సొంత గడ్డ. అయినా దుబ్బాక ఉప ఎన్నికలో ఓడిపోవడంతో  టీఆర్ఎస్ కు గడ్డు కాలం వచ్చిందనే సంకేతమిస్తోంది. 
 

గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కువ సార్లు టీఆర్ఎసే విజయం సాధించింది. ఉద్యమ సమయంలోనూ, అధికారంలోకి వచ్చాకా కూడా జరిగిన ఎన్నికల్లో అది సత్తా చాటింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చనిపోవడంతో ఉప ఎన్నిక జరిగిన నారాయణ్ ఖేడ్, పాలేరులోనూ సెంటిమెంట్ ను అధిగమించి ఘన విజయాలు సాధించింది టీఆర్ఎస్. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కంచుకోటగా చెప్పుకునే హుజూర్ నగర్ ఉప ఎన్నికలోనూ సూపర్ విక్టరి కొట్టింది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోల్ మేనేజ్ మెంట్ అద్భుతంగా ఉంటుందని చెబుతుంటారు. కేసీఆర్ రచించే ప్రణాళికలు విపక్షాలకు అందవని, అందుకే ఎక్కువగా గెలుస్తుంటారనే చర్చ కూడా ఉంది. అయితే అన్ని అనుకూలతలు ఉన్నా, అధికార పార్టీగా ఉండి కూడా దుబ్బాకలో ఓడిపోవడం టీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. 

 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి 62 వేల 5 వందల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సోలిపేటకు 54.36 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్ కు 16 శాతం ఓట్లు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన రావుకు కేవలం  22,595 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. కాని 20 నెలల్లోనే సీన్ పూర్తిగా మారిపోయింది. దుబ్బాక ఉప ఎన్నికలో దాదాపు 45 శాతం ఓట్లు సాధించారు రఘునందన్ రావు. అంటే గతంతో పోలిస్తే 32 శాతం ఓట్లు ఎక్కువ సాధించారు. అంటే అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత ఏ రేంజ్ లోఉందో  ఊహించవచ్చు. 20 నెలల్లోనే టీఆర్ఎస్ పార్టీ 15 శాతానికి పైగాఓట్లు కోల్పోవడం సామన్య విషయం కాదంటున్నారు అనలిస్టులు. అది కూడా అధికార పార్టీలో ఉపఎన్నికను ఎదుర్కొంటూ.. ఈ స్థాయిలో పతనం కావడం అంటే ఆ పార్టికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం స్పష్టం అవుతుందంటున్నారు. 

 

ఇక దుబ్బాక ఉప ఎన్నిక  ఫలితం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కు గొడ్డలి పెట్టుగా మారే అవకాశం ఉంది. ఇంతకాలం టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఫలితంతో షేకవుతోంది. దుబ్బాక జోష్ తో బీజేపీ దూకుడు పెంచి మరింత బలపడితే కాంగ్రెస్ మనుగడకే కష్టమని కొందరు కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. నిజానికి దుబ్బాకను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. పీసీసీ ముఖ్య నేతలంతా ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని 145 గ్రామాలకు 145 మంది నేతలను ఇంచార్జులుగా నియమించింది. వారంతా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. అయినా  గతంలో కంటే ఓట్లు తగ్గడం ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది. గెలవకపోయినా రెండో స్థానంలో నిలిచినా సరిపోయేదని,, ఇలా మూడో స్థానానికి పడిపోవడం తమకు తీరని నష్టమంటున్నారు. దీని ప్రభావం పార్టీపై ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేమని కొందరు కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

మొత్తంగా దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయంతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నాయనే చర్చే ఎక్కువగా జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ మొదలయినట్టేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో పాగా వేయడం ఖాయమంటున్నారు. చూడాలి మరీ తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో...