కరోనాను అదుపు చేయడంలో శక్తి, యుక్తిని ప్రదర్శించిన మహిళా నేతలు

విఫలమైన అగ్రదేశాల అధినేతలు

ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాలను అతలాకుతలం చేసింది కోవిద్ 19 వైరస్. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి అత్యంత ఆధునిక దేశాలుగా ప్రపంచపటంలో గుర్తింపు పొందిన దేశాలు ప్రాణభయంతో పరుగులు పెట్టేలా చేస్తోంది.
అగ్రదేశాల్లో మరణమృదంగం మోగిస్తోంది. అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశాలను, అతి తక్కువ సమయంలో కోవిద్ 19ను అదుపు చేసిన దేశాలను పరిశీలిస్తే ఒక వాస్తవం స్పష్టమవుతోంది.
కోవిద్ 19 బారిన పడుతున్న వారిలో మగవారి సంఖ్యనే ఎక్కువగా ఉన్నది ఒక సర్వే . అంతేకాదు పురుషాహంకార అధిపత్యధోరణి కనబరిచే వారి ఎలుబడిలో ఉన్న దేశాల్లో ఉగ్రరూపం దాల్చింది. 

కోవిద్ 19ను అరికట్టడంలో విఫలమైన ఏడు దేశాలు.. ఆ దేశాల అధ్యక్ష, ప్రధానులు గమనిస్తే ఈ విషయం మరింత స్పష్టం అవుతుంది.

కరోనా విజృంభణలో అమెరికాదే ప్రథమ స్థానం. ఆ దేశంలో కోవిద్ 19 కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరువలో ఉంది. మరణాల సంఖ్య1,36,671. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధిపత్యభావజాలం ప్రపంచ ప్రజలకు సుపరిచితమే.
రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ లో ఈ వైరస్ వ్యాప్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ ప్రధాని జైర్ బోల్సోనారో కోవిడ్ బారిన పడ్డారంటే అక్కడ నియంత్రణ చర్యలు ఏ మేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  బ్రెజిల్లో కరోనా కోరల్లో చిక్కిన వారి సంఖ్య  1,804,338 అయితే మరణించిన వారి సంఖ్య 70,524. మాస్క్ కూడా ధరించను అంటూ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన బోల్పోనారో అందుకు ప్రతిఫలంగా కోవిడ్ బారిన పడి క్వారంటైన్ లో ఉన్నారు.

రాకెట్ వేగంతో మూడోస్థానంలోకి వచ్చిన మనదేశంలోనూ నిరంకుశ ధోరణిలో వ్యవహరించే దేశప్రధాని కనిపిస్తారు. ప్రజా సంక్షేమం కంటే కార్పోరేట్ సంస్థల ఖజానా నిండటమే ముఖ్యమన్న ధోరణితో వ్యవహరిస్తూ దేశంలో కరోనా కేసులు ఎనిమిది లక్షల 22వేలు దాటేలా చేశారు. మరణాలు 22వేలు దాటాయి. ప్రతిరోజూ వేలసంఖ్యలో కేసులు నమోదు అవుతున్నా సరైన వైద్యసదుపాయాలు అందించడంలో విఫలం అయ్యారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఆ దేశంలో కోవిద్ 19బారిన పడిన వారి సంఖ్య 713,936 ఉండగా పదివేలకు పైగా మరణాలు సంభవించాయి.
పెరూ, చిలీ, స్పెయిన్, ఇటలీ దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ముంచుకొస్తున్న ముప్పును ఆయా దేశాల అధినేతలు సరైన అంచనా వేయలేకపోయారు. లక్షలాది మంది కరోనా బారిన పడేందుకు, వేలాది మంది ఈ వైరస్ కారణంగా మృత్యవాత పడేందుకు కారణమయ్యారు.

విజృంభిస్తున్న కోవిడ్ 19ను సమర్థవంతగా ఎదుర్కొన్న దేశాలు మహిళాధినేతల పరిపాలనలో ఉండటం గమనించదగిన విషయం. విపత్కర పరిస్థితులను సరిగ్గా అంచన వేయగలగడం, ప్రజల ప్రాణాలుకు ముప్పు రాకుండా తగిన చర్యలు తీసుకోవడం ఇందుకు కారణం అని చెప్పవచ్చు.

డెన్మార్క్ లోనూ కరోనా వ్యాప్తి చెందినప్పటికీ చాలా తక్కువ సమయంలో నియంత్రించారు. ఆ దేశ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ ప్రజలందరికీ కోవిద్ వైరస్ పరీక్షల నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా చోట్ల కోవిద్ 19 నెగిటివ్ రిపోర్ట్స్ చూయించిన వారికే అనుమతించారు. దాంతో కరోనాను కట్టడి చేయగలిగారు. ఆ దేశంలో 13,117 మంది ఈ వైరస్ బారిన పడగా 609 మంది మరణించారు.

వైరస్ తమ దేశంలోకి రాకముందే వస్తే ఎలా ఎదుర్కోవాలో అన్న అంశంపై పటిష్టమైన విధానాన్ని రూపొందించారు ఐస్లాండ్ ప్రధాని కాట్రిన్ జాకోబ్స్డోట్టిర్. ఆమె తీసుకున్న ముందస్తు చర్యలతో ఆ దేశంలో ఒక కేసు కూడా నమోదు కాలేదు.

దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేయడంతో పాటు వైద్యపరీక్షలను పెంచుతూ కరోనా వ్యాప్తిని అరికట్టారు ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్. ఇప్పటికీ ఆ దేశంలో లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఇప్పటి వరకు 7,279మంది కరోనా బారిన పడితే వారిలో 6,800మంది కోలుకున్నారు.  329మంది మరణించారు.
 
యూరప్ మొత్తంలో అత్యధిక పరీక్షలు నిర్వహించిన దేశం జర్మనీ. ఆ దేశ ప్రధాని ఏంజెలా మెర్కెల్ కోవిద్ వ్యాప్తి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ దేశంలో అధికంగా ఉన్న వృద్ధులకు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఏప్రిల్ నుంచే దశలవారిగా లాక్ డౌన్ ఎత్తేశారు. దేశ జిడిపిలో 11శాతం ప్రజల ఆరోగ్యం కోసమే వినియోగిస్తారు. కరోనా బారిన పడిన వారి సంఖ్య లక్షల్లో ఉన్నా మరణాల రేటు ఎక్కువగా లేకుండా చర్యలు తీసుకున్నారు.

న్యూజిలాండ్కు మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన జాకిందా ఆర్డెర్స్ పరిపాలనా దక్షతను ప్రపంచదేశాలు కీర్తిస్తున్నాయి. 2017లో న్యూజిలాండ్ 40వ ప్రధానిగా పదవి చేప్పటిన ఆమె ఉగ్రదాడులను, ప్రకృతివైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. కరోనా వ్యాప్తిని ముందుగా గుర్తించారు. ఫిబ్రవరి 2న చైనా బయటి దేశంలో మొదటి కరోనా మరణం సంభవించిన అంశాన్ని గుర్తించి చైనా నుంచి వచ్చేవారిని అడ్డుకున్నారు.
తమ దేశస్తులు వచ్చినా వారిని కచ్ఛితంగా క్వారంటైన్ లో ఉంచారు. జనాభా 80శాతం మంది ప్రభుత్వం నిబంధనలు వందశాతం పాటించేలా ప్రజలకు పరిస్థితులను వివరించారు. ఇప్పటివరకు 1,543 మంది కరోనా బారిన పడగా 1497మంది కోలుకున్నారు. 22మంది మరణించారు.

కచ్ఛితమైన నిబంధనలతో నార్వేలో మార్చి 12 నుంచి పూర్తిగా లాక్ డౌన్ పాటించారు. నార్వేప్రధాని ఎర్నా సోల్బెర్గ్ తీసుకున్న కఠినమైన చర్యలే  ఆ దేశంలో కోవిద్ ను అరికట్టింది. ఫిబ్రవరి 27 తర్వాత  తమ దేశానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ లక్షణాలతో సంబంధం లేకుండా క్వారంటైన్ లో ఉంచారు. 8974 మంది కరోనా బారిన పడగా 252 మరణించారు.

తాయ్ ఇవాన్-వెన్, తైవాన్ అధక్షురాలు తాయ్ ఇవాన్ వెన్ తీసుకున్న పటిష్టమైన నిర్ణయాలతో ఆ దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించారు. 17ఏండ్ల కిందట సార్స్ ప్రబలినప్పుడు ఎదురైన తీవ్రమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కఠినమైన చర్యలు తీసుకున్నారు. జనవరి నుంచే చైనా నుంచి వచ్చేవారందరినీ క్యారంటైన్ చేశారు. 

విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో మహిళలు తమ శక్తినే కాదు యుక్తి  ని ప్రదర్శిస్తారు అన్నది మరోసారి స్పష్టమైంది.
ఆడవారికి అధికారం ఇవ్వడం అనవసరం అనుకునేవారు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అదుపుచేసిన  ఈ మహిళానేతల గురించి తెలుసుకుని వారి అభిప్రాయాలు మార్చుకోవాలి.