మన యువత భద్రమేనా?

శారీరకంగా దృఢంగా ఉండే యువతను కరోనా ఏమీ చేయలేదని ఇన్నాళ్లుగా ప్రపంచం భావిచింది. ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న దేశంగా భారత్ కూడా అదే నమ్మింది. ఆ నమ్మకానికి కూడా ఇప్పుడు గండిపడినట్లే అని తెలుస్తోంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులే కరోనా బారిన అధికంగా పడుతుంటారని, నడివయసు లోపు ఉన్నవారిని ఆ వైరస్ ఏమీ చేయలేదని ఇన్నాళ్లు నమ్మేవాళ్లం. కానీ ఆ నమ్మకం కూడా ఇప్పుడు వమ్మయిపోయిన సూచనలు కనబడుతున్నాయి. యువతీయువకులపైన కరోనా తన ప్రతాపం చూపుతోందని సంకేతాలు వెలువడుతున్నాయి.

దేశంలో యువకులపై కరోనా పంజా విసురుతోంది. ప్రధానంగా 20 నుంచి 40 ఏళ్ల వయసు వారిపైనే తన ప్రతాపం చూపుతోంది. దేశంలో కరోనా కేసులను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, వాటి వివరాలు ట్రాక్‌ చేస్తున్న ‘కరోనా ట్రాకర్‌’అనే వెబ్‌సైట్‌ పాజిటివ్‌ కేసుల వివరాలను విశ్లేషించింది. ఆ విశ్లేషణ దేశవ్యాప్తంగా బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 1,751 కేసులు నమోదు కాగా.. 614 కేసులను విశ్లేషించింది. మిగిలిన కేసులకు సంబంధించిన వయసు, తదితర వివరాలు సమగ్రంగా లేకపోవడంతో 614 కేసులనే విశ్లేషించగలిగింది. 

ఈ కేసుల్లో 20 నుంచి 30 ఏళ్ల వయసున్నవారు 157 మంది ఉన్నారని తేల్చింది. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారు 129 మంది ఉన్నారని తెలిపింది. ఆ తర్వాత 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారు 97, 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారు 96 మంది ఉన్నారు. 60 నుంచి 70 మధ్య వయసు వారు 72 మంది ఉన్నారని వెబ్‌సైట్‌ విశ్లేషించింది. అత్యంత తక్కువగా 80 నుంచి 100 ఏళ్ల మధ్య వయసు వారు ఏడుగురు కాగా, 10 ఏళ్లలోపు వారు 15 మంది ఉన్నారు. 70 నుంచి 80 ఏళ్ల వయసు వారు 18 మంది ఉన్నారు. 10 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు వారు 23 మంది ఉన్నారు. 

అంటే అత్యంత ఎక్కువగా యుక్త వయస్కులకే కరోనా వ్యాపించిందని వెబ్‌సైట్‌ తెలిపింది. అయితే మరణాలు ఏ వయసు వారిలో ఎక్కువ ఉన్నాయన్న దానిపై విశ్లేషించలేదు. అంతర్జాతీయ విశ్లేషణల ప్రకారం 70 ఏళ్లు దాటినవారే అధికంగా మరణిస్తున్నారని తెలిపింది. 

కాగా, దేశంలో కరోనా కేసుల సంఖ్య నెల రోజుల్లో అనేక రెట్లు పెరిగాయని వెబ్‌సైట్‌ విశ్లేషించింది. మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 1 నాటికి ఎన్ని కేసులు పెరిగాయో తెలిపింది. మార్చి 1 నాటికి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5 మాత్రమే ఉన్నాయని తెలిపింది. ఆ సంఖ్య మార్చి 10వ తేదీ నాటికి ఏకంగా 48కు చేరాయి. మార్చి 20 నాటికి 199కి చేరాయి. మార్చి 31 నాటికి 1,619 కాగా, బుధవారం సాయంత్రానికి (ఏప్రిల్‌ 1 సాయంత్రం 6 గంటల వరకు) ఆ సంఖ్య 1,751కు, నేటికి 2065 కు చేరడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఏప్రిల్ 1 వరకూ దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,751 కాగా, వారిలో 53 మంది చనిపోయారని వెబ్‌సైట్‌ తెలిపింది. అంటే దేశంలో మరణాల రేటు 3.03 శాతంగా ఉన్నట్లు తేల్చింది. తెలంగాణలో 100 మందికి కరోనా సోకగా, వారిలో ఇప్పటివరకు పదిమిందికి పైగా చనిపోయారు. అంటే దేశవ్యాప్త కరోనా మరణాల రేటు కంటే రాష్ట్రంలో దాదాపు రెట్టింపు.. అంటే ఆరు శాతం కంటే ఎక్కువ ఉండటం గమనార్హం. ఇక కరోనా పాజిటివ్‌ వచ్చి కోలుకున్నవారు దేశంలో 155 మంది ఉన్నారు. అంటే రికవరీ రేటు 8.85 శాతం ఉన్నట్లు వెబ్‌సైట్‌ పేర్కొంది.