కరోనా రోగి ఇంట్లో 46 మంది నివాసం!

హైద‌రాబాద్ నారాయ‌ణ గూడ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని కింగ్ కోఠి పరదా గెట్ ప్రాంతం నుంచి ఢిల్లీ ఇస్త‌మాకు వెళ్లొచ్చిన వ్యక్తిని గుర్తించారు. ఇత‌నితో పాటు మ‌రో ఐదుగురు మార్చి 18న విమానంలో హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చారు. నాలుగు రోజుల క్రితం ఈ ఆరుగురిని గాంధీ హాస్పిటల్‌కు తరలించి పరీక్షలు నిర్వహించారు. వారిలో ఒక వ్యక్తికి క‌రోనా ఉన్నట్లుగా నిర్ధార‌ణ అయింది. పాజిటివ్ వ‌చ్చిన‌ వ్యక్తిది ఉమ్మడి కుటుంబం. ఒకే ఇంట్లో ఏకంగా 46 మంది కుటుంబసభ్యులు ఉంటారు.

మిగిలిన ఐదుగురి ఫలితాలు రావాల్సి ఉంది. అయితే వీరి ఇళ్ల‌ల్లో ఒక్కొక్కరి ఇంట్లో 20 మందికి పైగా నివసిస్తున్నార‌ని తెలుస్తోంది.

ఢిల్లీ వెళ్లిన వారిని గుర్తించేందుకు అటు పోలీసులు, ఇటు హెల్త్ టీమ్స్ ఇంటింటీకి తిరుగుతూ విచారణ చేపట్టిన‌ప్పుడు ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ 46 మంది కుటుంబ సభ్యులకు గాంధీ వైద్యురాలు దీప్తి ప్రియాంక ఆధ్వర్యంలో ఇంట్లోనే వైద్య పరీక్షలు చేస్తున్నారు. వారి శాంపిళ్లు సేక‌రించి గాంధీ ఆస్పత్రిలో టెస్టులకు పంపుతామని వైద్యులు తెలిపారు. అందరికీ చేతిపై క్వారంటైన్ స్టాంప్ వేసి ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావద్దని సూచించామ‌ని చెప్పారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలితే ఆస్పత్రికి త‌ర‌లిస్తామ‌ని చెప్పారు. అయితే వారందరిలో ఎంతమందికి వైరస్ సోకిందనే అంశం ఇప్పుడు అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ 46 మంది వ్యక్తుల ద్వారా.. ఇంకా బయటవారికైనా సోకిందా అనేది కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.