బియ్యం ఇలా వండకపోతే విషమే!

 

కంటి ముందు ఎన్ని పదార్థాలున్నా కానీ... బియ్యం లేకపోతే ఏదో లోటుగానే తోస్తుంది. బియ్యంతో మన బతుకులది ఓ శాశ్వతమైన బంధం. కానీ ఆ బియ్యం ఎంతవరకు సురక్షితం అంటే మాత్రం... ఆలోచించక తప్పదు! మనం తినే బియ్యంలో ఆర్సెనిక్ అనే విషం ఉందంటూ ఓ ఇంగ్లండు శాస్త్రవేత్త చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

 

ఏమిటీ ఆర్సెనిక్

 

ఆర్సెనిక్ అనే రసాయనం చాలా ఖనిజాలలో కనిపిస్తుంది. పరిశ్రమల్లో అయితే దీని ఉపయోగం అపారం. బ్యాటరీల దగ్గర నుంచి మందుగుండు వరకూ ఆర్సెనిక్ను అడుగడుగునా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక పురుగు మందులలోనూ, క్రిమిసంహారకాల్లోనూ ఆర్సెనిక్ది కీలకమైన పాత్ర. అలా ఈ ఆర్సెనిక్.... నీటి ద్వారా, మందుల ద్వారా మనం తినే పంటల్లోకి చొచ్చుకుపోతోందని, పర్యావరణవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. పదేపదే ఆర్సెనిక్తో నిండిపోయిన నేల మీద పంటలను పండించడం వల్ల ఈ ప్రమాదం ఎప్పటికప్పుడు పెరిగిపోతోందని తలలు బాదుకుంటున్నారు.

 

ఏమిటీ ప్రమాదం

 

మోతాదు దాటిన ఆర్సెనిక్ మన శరీరంలోకి చేరితే అది రకరకాల సమస్యలకు దారితీస్తుంది. వాంతులు, రక్తవిరేచనాలు, కడుపునొప్పి వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక దీర్ఘకాలికంగా కనుక అది శరీరంలో తిష్ట వేసుకుంటే డయాబెటిస్, గుండెజబ్బులు, కేన్సర్ వంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. చర్మం రంగు మారిపోతుంది, నరాల బలహీనత ఏర్పడుతుంది. ముఖ్యంగా పసిపిల్లల్లో ఈ ఆర్సెనిక్ అతి తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.

 

ఉపాయం ఏమిటీ

 

ఇంగ్లండులోని Queens University Belfastకు చెందిన Andy Meharg అనే శాస్త్రవేత్త బియ్యంలో ఉండే ఈ ఆర్సెనిక్ ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందేమో అని పరిశీలించారు. ఆయన పరిశీలనలో ఓ రెండు పద్ధతులు కాస్త ప్రభావవంతంగా కనిపించాయి. ఒక గ్లాసుడు బియ్యాన్ని అయిదు గ్లాసుల నీటిలో ఉడికిస్తూ మిగిలిన నీటిని కనుక పారబోస్తే... దాదాపు 50 శాతం ఆర్సెనిక్ కొట్టుకుపోతుందని తేలింది. ఇక బియ్యాన్ని ఓ రాత్రంతా నానబెట్టి, ఆ నీటిని పారబోస్తే కనుక కనీసం 80 శాతం ఆర్సెనిక్ తగ్గిపోతుందని కనిపెట్టారు. అలా కాకుండా బియ్యాన్ని యథాతథంగా కనుక వండేస్తే అందులో ఉండే ఆర్సెనిక్ నేరుగా మన శరీరంలోకి చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

- నిర్జర.