చెవిరెడ్డి సతీమణి ఖాతా నుంచి డబ్బులు జమ..!!

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇరుకునపడే సంఘటన ఒకటి జరిగింది.. చెవిరెడ్డి ఖాతా నుంచి ఆయన సతీమణి లక్ష్మీ ఖాతాకు కొంత డబ్బు బదిలీ అయింది.. తర్వాత ఆమె ఖాతా నుంచి ఒకేరోజు సుమారు 175 మంది వెలుగు సిబ్బంది ఖాతాల్లోకి, ఒక్కొక్కరి ఖాతాలో రూ. 2 వేల చొప్పున జమ చేసారు.. అయితే ఈ విషయం అధికారులకు తెలియడంతో వారు విచారణ చేపట్టారు.. ఇప్పటి నుంచి ఎన్నికలు జరిగే వరకూ ప్రతి నెలా ఇలాగే రూ.2 వేల చొప్పున నగదు డిపాజిట్‌ చేస్తామని ఎమ్మెల్యే మనుషులు తమకు చెప్పారని కొందరు వెలుగు అసిస్టెంట్లు ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు వెల్లడించినట్టు తెలుస్తోంది.. అలాగే రాత్రిపూట గ్రామాల్లో వయోజన విద్య బోధించే సాక్షర భారత్‌ కార్యకర్తలకు కూడా తమ మాదిరిగానే నెలకు రూ.1,500 చొప్పున వారి ఖాతాలకు పంపుతామని ఎమ్మెల్యే వర్గీయులు సమాచారం ఇచ్చారని ఇంకొందరు తెలిపినట్టు తెలుస్తోంది.

 

 

అయితే దీనిని రాష్ట్రప్రభుత్వ వర్గాలు తీవ్రంగా పరిగణించడంతో పాటు, విచారణ నిమిత్తం ఏసీబీకి అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం.. దీంతో ఆందోళన చెందిన వెలుగు సిబ్బంది.. ఆ డబ్బులు తీసుకునే ప్రసక్తే లేదని,వెనక్కి ఇచ్చేస్తామని స్పష్టం చేశారు.. అయితే ఈ విషయంపై చెవిరెడ్డి సతీమణి లక్ష్మి స్పందన మరోలా ఉంది.. సంఘమిత్రల కష్టాలను చూసి సాయం చేద్దామని వారి ఖాతాల్లో డబ్బులు జమచేశామన్నారు.. రాత్రింబవళ్లు ప్రభుత్వం చెప్పిన పనులన్నీ చేస్తూ కష్టాలను ఎదుర్కొంటున్న సాటి సంఘమిత్రలకు సాయం చేస్తే తప్పా? అని ఆమె ప్రశ్నించారు.. ఒకరోజు తమ ఇంటికి వచ్చిన సంఘమిత్రలు, 20 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వం చెప్పే 17 రకాల పనులను చేస్తూనే ఉన్నామని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా కాదు కదా కనీసం మనుషులుగా కూడా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారన్నారు.. వైసీపీ అధికారంలోకి వస్తే రూ.10 వేలకు తగ్గకుండా సంఘమిత్రలకు జీతం ఇస్తామని జగన్‌ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చారన్నారు.. వారి కష్టాలను చూసి బాధ పడి ఎమ్మెల్యే భార్యగా కొద్దిపాటి సాయం చేద్దామని ఒక్కో సంఘమిత్ర ఖాతాలో రూ.2 వేలు తన ఖాతా నుంచి జమ చేసిన మాట వాస్తవమేనని ఆమె అంగీకరించారు.. మూడున్నర లక్షల రూపాయల సాయానికి ఏసీబీ విచారణ అవసరమా అని ఆమె ప్రశ్నించారు.