రాహుల్ కి ప్రధాని హోదా.. ఏపీకి ప్రత్యేక హోదా.!!

అవిశ్వాస తీర్మానం బీజేపీని ఎంత దెబ్బ తీసిందో తెలీదు కానీ, కాంగ్రెస్ లో మాత్రం విశ్వాసం పెంచింది.. ముఖ్యంగా అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్బంగా రాహుల్ గాంధీ ఇచ్చిన స్పీచ్ తో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.. ఇదే ఉత్సాహంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది.. తాజాగా రాహుల్‌ గాంధీ అధ్యక్షతన సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం ఢిల్లీలో జరిగింది.

 

 

నరేంద్ర మోదీ సర్కారును గద్దె దించి, రాహుల్‌ గాంధీని ప్రధాని పదవిపై అధిష్టింపచేయడమే పార్టీ లక్ష్యమని సీడబ్ల్యూసీ తీర్మానించింది.. రాబోయే ఎన్నికల్లో 200కుపైగా సీట్లు సాధించి ఏకైక అతి పెద్ద పార్టీగా నిలిచేందుకు పోరాడాలని నిర్ణయించింది.. ఎన్నికలకు ముందు, తర్వాత ఏయే పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాలో, ఎవరెవరితో చర్చలు జరపాలో నిర్ణయించే బాధ్యతను రాహుల్ కే అప్పగించింది.. అలానే పది కీలక అంశాలపై పోరాడాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది.. వాటిల్లో ఏపీ ప్రత్యేకహోదా అంశం కూడా ఉండటం విశేషం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పూర్తిగా కట్టుబడి ఉందని కమిటీ తీర్మానించింది.. కేంద్రంలో అధికారంలోకి వస్తే, రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేసింది.. అయితే ఒడిసా పీసీసీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ బిహార్‌తోపాటు తమ రాష్ట్రం కూడా వెనకబడి ఉన్నాయని, వాటికి కూడా ప్రత్యేక హోదా కల్పించే విషయంపై పోరాడాలని సూచించారు.. ఈ విషయంపై స్పందించిన సోనియాగాంధీ 'రాష్ట్ర విభజనతో ఏపీ ఆర్థికంగా ఎంతో నష్టపోయింది.. దానికి అన్యాయం జరిగింది.. అందుకే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని హామీ ఇచ్చాం.. ఆ రాష్ట్రంతో ఇతర రాష్ట్రాలను పోల్చేందుకు వీలు లేదు' అని స్పష్టం చేశారు.. అదే విధంగా రాహుల్ మాట్లాడుతూ 'నిర్దిష్ట పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చామని.. దానికి కట్టుబడి ఉన్నామని.. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఏపీకి ప్రత్యేక హోదాపై ఎవరూ మాట్లాడడానికి వీలు లేదు' అన్నారు.