వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం..!

 

తెలంగాణ సీఎం కేసీఆర్, ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసరడం.. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్దమే అంటూ ప్రతిసవాల్ విసరడం తెలిసిందే.. అయితే ముందస్తు ఎన్నికల గురించి కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత జానారెడ్డి కాస్త భిన్నంగా స్పందించారు.. ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ సవాల్‌ హాస్యాస్పదమన్నారు.. ఐదేళ్లు పరిపాలించమని ప్రజలు ఓట్లేస్తే.. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో కేసీఆర్‌ ప్రజలకి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.. 

కేంద్ర ప్రభుత్వం కూడా ముందుస్తు ఎన్నికలకు పోవాలని చూస్తుందని, దాని ట్రాప్ లో టీఆర్ ఎస్ పడినట్టు కనిపిస్తోందని ఆరోపించారు.. ఒకవేళ టీఆర్ ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే...ఎందుకు వెళుతున్నారో ప్రజలకు చెప్పాల్సి ఉంటుందన్నారు.. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యుల్ విడుదల చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంటుందన్నారు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేను కానీ అధికారం చేపట్టడానికి కావాల్సినన్ని స్థానాల్లో మాత్రం గెలుస్తామని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.. 

అదే విధంగా, డీ శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్న వార్తలపై స్పందించిన జానారెడ్డి.. డి శ్రీనివాస్ తనతో మాట్లాడలేదని, ఈ విషయం గురించి ఇంకా ఎటువంటి సమాచారం తనకి అందలేదని అన్నారు.. అలానే, పీసీసీలో మార్పులు చేర్పులు జరుగుతాయన్న సమాచారం లేదని.. దీనిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారం నాయకులు, కార్యకర్తలు పని చేయాల్సి ఉంటుందన్నారు.. పార్టీ నేతల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ పార్టీ మొత్తం ఐక్యంగా ఉందని స్పష్టం చేసారు.. చూద్దాం మరి జానారెడ్డి అనుకున్నట్టు వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడానికి కావాల్సినన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందో లేదో.