టార్గెట్ రేవంత్.... టీకాంగ్రెస్ లో ఏకమైన సీనియర్లు

 

 

హుజూర్‌నగర్ ఉపఎన్నిక... ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలను ఏకంచేసింది. హుజూర్‌‌నగర్ ఉపఎన్నిక అభ్యర్ధిత్వంపై తలెత్తిన వివాదంతో నల్గొండ కాంగ్రెస్‌ నేతలంతా ఏకమయ్యారు. హుజూర్‌‌నగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్ధిగా తన భార్య పద్మావతిని ఉత్తమ్ ప్రకటించడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించడంతో సీనియర్లంతా ఏకమవుతున్నారు. అసలు నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో వేలు పెట్టడానికి రేవంత్ ఎవరంటూ ఏకతాటిపైకి వస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ ఉప్పూనిప్పులా ఉండే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి-ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య స్నేహం చిగురించింది.

పార్టీలో రేవంత్ ఆధిపత్యం, ప్రాబల్యం పెరుగుతోందని భావిస్తోన్న సీనియర్లు ఏకమవుతున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ తోపాటు  నల్గొండ కాంగ్రెస్‌ నేతలంతా రేవంత్‌‌పై మండిపడుతున్నారు. తాను రాజీనామాచేసిన తన సొంత నియోజకవర్గంలో నా భార్యను అభ్యర్ధిగా ప్రకటిస్తే తప్పేటంటూ ఉత్తమ్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అసలు మా జిల్లాలో వేలు పెట్టడానికి రేవంత్ ఎవరంటూ నల్గొండ కాంగ్రెస్ లీడర్లు ఫైరవుతున్నారు. తమ జిల్లా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం తమకుందని, ఇతరులు... తమ జిల్లా రాజకీయాల్లో వేలుపెడితే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. అయితే, ఎప్పుడూ ఉత్తమ్ పై విమర్శలుచేసే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.... హుజూర్‌నగర్ ఉపఎన్నికలో పద్మావతిని గెలిపించుకుని తీరతామని ప్రకటించడంతో... ఉత్తమ్-కోమటిరెడ్డి మధ్య స్నేహం చిగురించింది. ఇన్ని రోజులూ పక్కలో బల్లెంలా ఉన్న కోమటిరెడ్డి... మద్దతివ్వడంతో ఊపిరిపీల్చుకున్న ఉత్తమ్‌.... మిగతా నేతలతో కలిసి రేవంత్‌ను టార్గెట్‌ చేయడం మొదలుపెట్టారు. ఇక కోమటిరెడ్డి అయితే, రేవంత్ పై సెటైర్లు వేశారు. కొత్తగా వచ్చినోళ్ల సలహాలు తమకు అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో విభేదాలున్నా, తాను, ఉత్తమ్, జానారెడ్డి ఒక్కటిగా పనిచేస్తున్నామంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు పీసీసీ రేసులో తాను ఒక్కడిని మాత్రమే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు.

మొత్తానికి రేవంత్‌రెడ్డి మూలంగా నల్గొండ కాంగ్రెస్‌లో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఇప్పటివరకు తిట్టుకున్న లీడర్ల మధ్య సరికొత్త స్నేహం చిగురించేలా చేసింది. ఒకరు ఔనంటే... మరొకరు కాదనే నేతలు ఇప్పుడు... తమ అందరిదీ ఒకే మాట అంటున్నారు. మరి ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.