ఆ ఏడుగురితో రాహుల్ భేటీ

 

సీట్ల కోసం తర్జన భర్జన పడ్డ మహాకూటమి పార్టీలు ఎట్టకేలకు అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తున్నాయి.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెండు విడతలలో 75 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.కాగా కూటమికి కేటాయించిన స్థానాలు,అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో ఆశావహులు రెబల్స్ గా మారుతున్నారు.కానీ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు బుజ్జగింపులు పర్వం మొదలుపెట్టలేదు.ఇప్పటికీ మిగతా స్థానాల అభ్యర్థుల విషయమై చర్చలు జరుగుతున్నాయి.తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్, కుంతియా, ఇంచార్జ్ సెక్రటరీలు, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ముఖ్య సభ్యులు సమావేశమయ్యారు.మిగిలిన స్థానాల్లో అభ్యర్థులపై చర్చించారు.12 మంది అభ్యర్థులను ఖరారు చేశారు.మిగతా 7 స్థానాల అభ్యర్ధుల ఖరారు మళ్లీ పెండింగ్‌లో పెట్టారు.వీటి కోసం మరోసారి సమావేశం అయ్యే అవకాశం ఉంది. 7 నియోజక వర్గాల కు సంబంధించిన తీవ్ర పోటీ ఉండటంతో ఆశావహులను ఢిల్లీకి రావాలని సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

తుంగతుర్తి నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తున్న అద్దంకి దయాకర్‌, వడ్డేపల్లి రవి, మిర్యాలగూడ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి, జనగామ సీటుపై పొన్నాల లక్ష్మయ్యతో పాటు సనత్‌నగర్‌ స్ధానంలో మర్రి శశిధర్‌ రెడ్డి, హుజూరాబాద్‌ నుంచి రేసులో ఉన్న కౌశిక్‌ రెడ్డిలు రాహుల్‌తో భేటీ కానున్నారు.రాహుల్‌తో ఆశావహుల భేటీ అనంతరం ఈ ఏడు స్ధానాల్లో పార్టీ అభ్యర్ధులను ఖరారు చేస్తారు.