పీఎం కుర్చీపై రాహుల్ కర్చీఫ్! మోదీ ట్రాప్‌లో పడ్డ కాంగ్రెస్ పార్టీ! 

2014లో జరిగినట్టే మళ్లీ జరుగుతోందా? ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ట్రాప్ లో చిక్కుతోందా? పరిణామాలు చూస్తోంటే అలాగే అనిపిస్తోంది! రాహుల్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాక తొలి సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. రాహుల్ నాయకత్వంలో దేశంలోని ప్రధాన ప్రతిపక్షం సమాలోచనలు జరిపింది. చివర్న రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్థి అంటూ హస్తం పార్టీ సంకేతాలిచ్చింది. నిజానికి, ఇదే కమలానికి కావాల్సింది! కాషాయ నేతల ఆశలన్నీ రాహుల్ వర్సెస్ మోదీ పోరు జరగాలనే! ఆ ట్రాప్ లో చిక్కినట్టే కనిపించింది కాంగ్రెస్ పార్టీ!

 

 

2014లో బీజేపీకి స్పష్టంగా మోదీ అనే నేత నాయకత్వం వహించారు. కాంగ్రెస్ కి సోనియా వున్నా ఆమె ప్రధాని అభ్యర్థి కాదు. మన్మోహన్ మళ్లీ పీఎం అని కాంగ్రెస్ ఎక్కడా చెప్పలేదు. పోనీ రాహుల్ పీఎం అవుతారని కూడా అనలేదు. అయినా కూడా గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అంతా మోదీ చుట్టూ తిరిగింది. మోదీ వర్సెస్ ఇతర పార్టీలు అన్నట్టు కొనసాగి చివరకు ఓటర్లు నమో మీదే నమ్మకం చూపేలా చేసింది. అయితే, కాంగ్రెస్ ఈసారి తొందరపడి రాహుల్ ని పీఎం క్యాండిడేట్ గా ప్రకటించి మళ్లీ మోదీకి మేలు చేసినట్టు కనిపిస్తోంది!

 

 

2014లో కాంగ్రెస్ తమ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పకున్నా జనం దృష్టి మోదీ అనే వ్యక్తి మీద నిలిచింది. పార్టీలు, పార్టీల గుర్తులు ప్రాముఖ్యత కోల్పోయాయి. ఇప్పుడు రాహుల్ మా ప్రధాని అంటూ కాంగ్రెస్ ప్రకటించే సరికి మరో మారు అమెరికన్ స్టైల్లో వ్యక్తుల మధ్య పోరాటంగా పరిణమించబోతోంది. మోదీ వర్సెస్ రాహుల్ అయితే బీజేపీకి పండగే. ఎందుకంటే, గతంలో కంటే ఇప్పుడు రాహుల్ ఇమేజ్ కాస్త బెటరైనా మోదీని ఢీకొట్టే స్థాయిలో క్రేజ్ రాలేదు. అదే విధంగా రాహుల్ నేతృత్వం దేశంలోని ఎన్ని పార్టీలకు, ఎంత మంది సీనియర్ నాయకులకు ఆమోదం? ఇదీ అనుమానమే! కాబట్టి ఏ విధంగా చూసినా కాంగ్రెస్ ఈ విషయంలో తొందరపడిందనే చెప్పుకోవాలి. రాహుల్ మా ప్రధాని అభ్యర్థి అని చెప్పటం ద్వారా హస్తం పార్టీకి వచ్చే ప్రత్యేక లాభాలేం లేవు. కానీ, అదే సమయంలో బీజేపీకీ మాత్రం మోదీ ప్రత్యర్థిగా రాహుల్ వుండటం ఎంతో అవసరం. దేశమంతా పార్లమెంట్ ఎన్నికల్ని మోదీ వర్సెస్ రాహుల్ గా భావిస్తే ఓటర్లు నరేంద్రుడి వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువుంటాయి. అదే సమయంలో మోదీ, రాహుల్ ప్రచార హోరులో మమత, మాయ, ములాయం, చంద్రబాబు, కేసీఆర్… ఇలా అందరు సీనియర్ నేతలు సైడ్ లైన్ అవుతారు. తమతమ రాష్ట్రాలకే పరిమితం అవుతారు. ఇది మోదీకి అతి పెద్ద లాభం. తెలిసో తెలియకో కాంగ్రెస్ ఈ లబ్ది చేకూర్చిపెడుతోంది మోదీకి!

 

 

తమకు రెండు వందల దాకా సీట్లు వస్తే రాహులే ప్రధాని అని చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించుకోవాలి. ప్రస్తుతం నలభై సీట్లు మాత్రం వున్న పార్టీ అమాంతం రెండు వందలకు చేరుకోవటం కష్టం. అదీ చాలా చోట్ల రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు లేవు. మరప్పుడు ఎంపీల్ని గెలిపించుకోవటం రాహుల్ కు తలకు మించిన భారమే. అటువంటప్పుడు మోదీని అడ్డుకోవాలని నిజంగా వుంటే… ప్రాంతీయ పార్టీలు, నాయకుల్ని కలుపుకుపోవాలి.ఎన్నికల పలితాలు పూర్తిగా వచ్చేదాకా ప్రధాని అభ్యర్థిత్వంపై మాట్లాడకుండా వుండాలి. ఒకవేళ నిజంగానే ప్రభుత్వ వ్యతిరేకత, మోదీపై అసంతృప్తి కారణంగా కాంగ్రెస్ కు రెండు వందల దాకా సీట్లొస్తే మిగతా పార్టీలన్నీ రాహుల్ నే పీఎంని చేస్తాయి. దానికి ఇప్పట్నుంచే కుర్చీపై కర్చీఫ్ వేసుకోవాల్సిన అవసరం ఏంటి? అనవసరంగా మద్దతు ఇచ్చే ప్రాంతీయ పార్టీల్లో కూడా భయాలు, అనుమానాలు రేకెత్తించటం తప్ప! కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుంది!