అధికారం కోసం కాంగ్రెస్‌ కొత్త ఎత్తు... వ్యూహం మార్చిన టీపీసీసీ ?

కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ... నేతల మధ్య సఖ్యత చాలా తక్కువ... ఒకరు ఎడ్డెం అంటే... మరొకరు తెడ్డెం అనే టైపు.... కానీ అధికారం కోసం అర్రులు చాస్తోంది. నెక్స్ట్ పవర్లోకి వచ్చేది తామేనని చెబుతోంది... అయితే పార్టీలో అనైక్యత, విభేదాలు... ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని టీపీసీసీ ఓ సూపర్‌ ప్లాన్‌ను రూపొందించింది. అందుకు రాహుల్ గాంధీనే పెద్ద దిక్కుగా వినియోగించుకుంటోంది.

 

ఇటీవల సంగారెడ్డిలో ప్రజా గర్జన పేరుతో ఓ సభను నిర్వహించి దానికి రాహుల్ ను తీసుకొచ్చిన హస్తం నేతలు...ఇప్పుడు ఆయన ప్రసంగాలను ప్రజలకు వినిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పార్టీ నాయకులు  గ్రామ గ్రామానికి వెళ్లాలంటూ...సంగారెడ్డి సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పిలుపునివ్వడంతో... రాహుల్ సందేశ్ యాత్ర పేరుతో కాంగ్రెస్ నేతలు కార్యాచరణకు దిగిపోయారు. రంజాన్ తర్వాత ఈ యాత్రను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.

 

యాత్రలో భాగంగా జిల్లాల వారీగా స‌భ‌లు నిర్వహించి... సంగారెడ్డి సభలో రాహుల్ చేసిన ప్రసంగాలనే ప్రజలకు వినిపించనున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఓ ఛార్జిషీట్ ను పంపిణీ చేయడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు... కార్యక్రమాల గురించి కూడా వివరించనున్నారు. 

 

అయితే రాష్ట్ర నేతల్లో ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వకుండా.... రాహుల్ పేరుతో యాత్ర నిర్వహిస్తే  భిన్న ధృవాలుగా వ్యవహరించే వారంతా కలిసి వస్తారనేది పీసీసీ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. మరి వారి వ్యూహం ఫలిస్తుందో లేదో రాహుల్ సందేశ్ యత్ర ప్రారంభమైతేగానీ తెలియదు.