అసలే పార్టీ పరిస్థితి బాగా లేదు... పైగా ఈ చెత్త రూల్స్‌ ఏంటి?

2019లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటోన్న కాంగ్రెస్‌... ఒకవైపు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాడుతూనే.... మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా కమిటీలు, పెండింగ్‌ డీసీసీల అధ్యక్షుల నియామకాలను పూర్తి చేయాలనుకుంటోంది. అయితే కీలకమైన డీసీసీ అధ‌్యక్ష పదవులు చేపట్టేందుకు సీనియర్లు ఎవరూ ముందుకురావడం లేదు. కనీసం మోస్తరు లీడర్ల కూడా ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఎందుకంటే రాహుల్‌ తీసుకొచ్చిన కొత్త రూల్సే దానికి కారణం. డీసీసీ అధ్యక్షులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమన్న అధిష్టాన నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.

 

అసలే పార్టీ పరిస్థితి బాగాలేదు... పైగా ఈ చెత్త రూల్స్‌ ఏంటంటూ దిగ్విజయ్ ముఖం మీదే చెప్పేశారు. ఇలాగైతే ఎవరూ సీనియర్లు ఎవరూ డీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టరని, దాంతో జిల్లాల్లో పార్టీ బలోపేతం కూడా సాధ్యంకాదన్నారు. సమర్ధులు, సీనియర్లకు డీసీసీ బాధ్యతలు అప్పగించాలని, అలాగే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కూడా ఇవ్వాలని, అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని, లేదంటే అంతే సంగతులని దిగ్విజయ్‌కి తేల్చిచెప్పారు. అయితే సీనియర్ల అభిప్రాయాలను రాహుల్ దృష్టికి తీసుకెళ్తానని దిగ్విజయ్‌... మండల కమిటీల నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని ముఖ్యనేతలకు ఆదేశించారు.

 

మరోవైపు నేతల మధ్య సమన్వయం కొరవడుతోందని గుర్తించిన అధిష్టానం... క్రమశిక్షణ ఉల్లంఘించే లీడర్లపై చర్యలు తీసుకోవాలని భావిస్తోందట. దిగ్విజయ్‌ ముందే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి కొట్టుకోవడాన్ని హైకమాండ్‌ సీరియస్‌గానే తీసుకుందంటున్నారు. మరోసారి ఇలాంటి సీన్‌ రిపీట్‌ అయితే ఉపేక్షించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. ఓవైపు చెత్త రూల్స్‌... మరోవైపు కుమ్ములాటలతో లీడర్ల మధ్య సమన్వయం లోపిస్తుంటే, పార్టీ బలోపేతం ఎలా సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కుతుందని దిగ్విజయ్‌తోపాటు టీకాంగ్రెస్‌ సీనియర్లు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారట.