కాంగ్రెస్ అధిష్టానానికి అగ్నిపరీక్షలు

 

ఈ రోజు కేంద్ర క్యాబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఇందులో తెలంగాణా పై నోట్ ప్రవేశపెట్టే అవకాశం లేన్నపటికీ హోంశాఖ నోట్ పై తయారుచేసిన ముసాయిదాపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సమావేశంలో నోట్-ముసాయిదాపై తుది నిర్ణయం తీసుకొన్నట్లయితే, త్వరలో విభజన ప్రక్రియ జోరందుకోవచ్చును.

 

టీ-నోట్ పై అడుగు ముందుకు వేస్తే వెంటనే రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్న సీమాంధ్ర యంపీలకు దిగ్విజయ్ సింగ్, వారికి భయపడి వెనకడుగువేసే ప్రసక్తే లేదని స్పష్టం చేయడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం రానున్నఎన్నికలలోగా విభజన ప్రక్రియను తప్పకుండా పూర్తి చేస్తామని ప్రకటించిన నేపధ్యంలో ఈ రోజు సమావేశంలో ఆ దిశగానే కేంద్రం అడుగులువేయవచ్చును.

 

ఇది కాంగ్రెస్ పార్టీకే కాక, సీమాంధ్ర యంపీలకు,మంత్రులకు, శాశనసభ్యులకు అందరికీ అగ్ని పరీక్షగా మారనుంది. ఒకవేళ వారు రాజీనామాలు చేస్తే, ప్రభుత్వం పడిపోయే పరిస్థితి కల్పించడమే కాకుండా, ఎందరు వ్యతిరేఖిస్తున్నాముందుకే సాగుతున్నదుకు కాంగ్రెస్ పార్టీ పట్ల సీమాంధ్రలో వ్యతిరేఖ భావనలు మరింత పెరిగే అవకాశం ఉంది.

 

ఇక మరో ఏడు నెలలో సాధారణ ఎన్నికలను పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చేజేతులా కూల్చుకొంటే అది పార్టీకి, నేతలకీ ఇద్దరికీ తీవ్ర నష్టం కలిగించడం ఖాయం. అలాగని రాష్ట్ర విభజనకే మొగ్గు చూపుతున్న అధిష్టానాన్నివెనకేసుకు వస్తే ఇప్పటికే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంటున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రానున్న ఎన్నికలలో ప్రజల మద్దతు పొందడం కష్టం. పైగా తెదేపా, వైకాపాలు వారి పరిస్థితిని మరింత క్లిష్టం చేయడం ఖాయం. కనుక కాంగ్రెస్ అధిష్టానానికి ఇది మరో పెద్ద అగ్ని పరీక్షే నని చెప్పవచ్చును.

 

ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం-రాష్ట్ర విభజన, హైదరాబాద్ అంశం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మనుగడ, రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడం వంటి అన్నిఅంశాలను ఒకేసారి నేర్పుగా పరిష్కరించుకోవలసి ఉంటుంది.