కాంగ్రెస్‌కి ఆటలైపోయింది!

 

 Congress on telangana, Digvijay singh, Kiran Samaikyandhra, Telangana state, All Party meeting, Kiran delhi

 

 

తెలుగు ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఇష్టమొచ్చినట్టు ఆడుకుంటోంది. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండేది ఇంకా నాలుగైదు నెలలే కాబట్టి ఈలోపు సాధ్యమైనంత ఎక్కువగా ఆడుకోవాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు తెలుగు ప్రజల గుండెలు మండిపోయేలా చేస్తోంది. తెలుగు ప్రజలు ఈ ఆవేదనలో వున్నా కనికరించని కాంగ్రెస్ పార్టీ తన ఆటలు కంటిన్యూ చేస్తోంది.

 

కేంద్రం నిరంకుశంగా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా సమైక్య రాష్ర్టాన్ని కోరుకుంటున్నారో లేక అధిష్ఠానం ఆడమన్నట్టు ఆడుతున్నారో గానీ, మొదటి నుంచీ సమైక్యవాదన వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టెక్నిక్కులను అర్థం చేసుకోలేని సామాన్య ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డిని సమైక్యవాదిగానే నమ్ముతున్నారు. అలాంటి పరిస్థితుల్లో శుక్రవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, తెలుగు ప్రజల మెడమీద గుదిబండ అయిన దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు అంగీకరించారని ప్రకటించడం తెలుగు ప్రజల్ని హతాశులను చేసింది. ఒక్క పూటలో ముఖ్యమంత్రి ఇలా ప్లేటు తీప్పేశారేంటా అని బాధపడేలా చేసింది.


అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని, తాను రాష్ట్ర విభజనకు అంగీకరించానని దిగ్విజయ్ సింగ్ ప్రకటించడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చని ప్రకటించారు. ఏంటీ డ్రామాలు? ఎవరి ఇష్టమొచ్చినట్టు వాళ్ళు, ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సొంత ప్రాపర్టీనా? ఒకపక్క తెలుగు ప్రజల గుండెలు మండిపోతూ వుంటే ఇలాంటి చెలగాటాలు ఆడటం కాంగ్రెస్ పార్టీ నాయకులకు పద్ధతి కాదు. దిగ్విజయ్ సింగ్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయదలుచుకుంటే తనని తరిమికొట్టిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి చేసుకుంటే మంచిది. తెలుగు ప్రజలతో ఇంకా ఆడుకోవాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆటలని తెలుగు ప్రజలు త్వరలో కట్టిస్తారు.