ప్రియాంకను రాజ్యసభకు పంపాలనే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్


 

ప్రియాంక గాంధీ చట్ట సభల్లో అడుగు పెట్టబోతున్నారా, పార్టీ పదవులకే పరిమితమైన ప్రియాంక ఇప్పుడు పార్లమెంట్ లో తన వాణి వినిపించనున్నారా, ప్రియాంకను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యే వారిలో ప్రియాంక పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చట్ట సభలో ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మోతీలాల్ వోరా, మధుసూదన్ మిస్త్రీ, కుమార్ సెల్జా దిగ్విజయ్ సింగ్, బీకే హరిప్రసాద్, ఎంబి రాజుగూడ వంటి సీనియర్ నేతల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్, జూన్ లో పూర్తి కానుంది. ఇందులో వోరా, సెల్జా, దిగ్విజయ్ మళ్లీ రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశముంది. అయితే ఈసారి ప్రియాంకా గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా, రణదీప్ సూర్జెవాలాలను పెద్దల సభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఆలోచిస్తోంది.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఏదో ఒకచోట నుంచి ప్రియాంకను రాజ్యసభకు పంపొచ్చని భావిస్తున్నారు. రాజ్యసభలో పార్టీ వాణిని బలంగా వినిపించే నాయకులను ఈసారి ప్రమోట్ చేయాలని సోనియగాంధీ భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రియాంకాగాంధీని రాజ్యసభ బరిలోకి దింప బోతున్నారనే టాక్ నడుస్తోంది. పెద్దల సభలో మొత్తం రెండు వందల నలభై ఐదు స్థానాలు ఉండగా మరికొన్ని నెలలు అరవై ఎనిమిది సీట్లు ఖాళీ అవుతాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది సీట్లు కోల్పోనుంది. అయితే మిత్ర పక్షాల సాయంతో వాటిలో పదింటిని కాంగ్రెస్ మళ్లీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. లోక్ సభలో రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలన్నది పార్టీ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది.