కాంగ్రెస్ యంపీల సంకల్ప డ్రామా

 

రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటామని, తమ పదవులకు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామాలు చేసేదిలేదని తెగేసిచెప్పిన పనబాక లక్ష్మి, కిల్లి క్రుపారాణీ, జేడీ.శీలం, కావూరిల గురించి సీమాంధ్ర ప్రజలకు ఎటువంటి అపోహలు లేవు. సీమాంధ్రకు కావలసిన ప్యాకేజీల గురించి మాట్లాడిన పురందేశ్వరి గురించి కూడా ఎటువంటి అనుమానాలు లేవు. చివరికి హైదరాబాద్ ను యూటీ చేయవలసిందేనని వాదించి అకస్మాత్తుగా మాయమయిపోయిన చిరంజీవిని కూడా తప్పు పట్టడానికి లేదు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరుగకుండా అడ్డుకొంటామని మైకులు పగిలిపోయేలా ఘర్జిస్తూ ఒకసారి రాజీనామాలు, మరోసారి కోర్టులో కేసులు, ఇంకోసారి స్వంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం అంటూ రకరకాల డ్రామాలు ఆడుతున్న ఆ ఆరుగురు కాంగ్రెస్ యంపీలు లగడపాటి, రాయపాటి, ఉండవల్లి, హర్ష కుమార్, సాయి ప్రతాప్, సబ్బంహరిల వ్యవహార శైలే చాలా అనుమానాస్పదంగా ఉంది.

 

వారందరూ రేపటి నుండి సంకల్ప దీక్ష పేరుతో రెండు రోజులు సాగే మరో కొత్త నాటకం ప్రదర్శించబోతున్నారు. అందుకు వేదిక హైదరాబాదులో ఇందిరా పార్క్. వారందరూ తమ యంపీ పదవులకు రాజీనామాలు చేసామని చెప్పుకొంటారు. కానీ నేటికీ అవి ఆమోదం పొందలేదు గనుక యంపీలుగా కొనసాగుతున్నారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అవిశ్వాస తీర్మానం పెట్టామంటారు. కానీ అది సభలో చర్చకే రాదు. ఇప్పడు రాష్ట్ర విభజన ను వ్యతిరేకిస్తూ రెండు రోజులు దీక్ష చేయబోతున్నారు. కానీ రాష్ట్ర విభజన ఆగబోదు. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నపుడు యంపీలయిన వారందరూ అధికారికంగా ఏమీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద వారు చేసే దీక్షవల్ల కొత్తగా ఏమి ఒరుగుతుందో వారికే తెలియాలి.

 

బహుశః తామే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేస్తున్నామని మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం కావచ్చును. రేపు తెలంగాణావాదులెవరయినా అక్కడకి వచ్చిఅలజడి సృష్టిస్తే, తాము ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నామని చెప్పుకొని సానుభూతి ఓట్లు కూడా ఆశించవచ్చును. తాము ఏ పార్టీలో చేరి, ఏ రంగు కండువా కప్పుకొన్నా ప్రజలందరూ తమ మొహాలను జాగ్రత్తగా గుర్తుంచుకొని రానున్నఎన్నికలలో తమకే ఓట్లు వేయాలని చెప్పేందుకు వారి దీక్ష ఉపయోగపడుతుంది తప్ప రాష్ట్ర విభజనను ఆపలేదని వారికి కూడా తెలుసు. వారి రాజీనామాలు, ఉద్యమాలు, దీక్షలు అన్నీ ప్రజలని ఆకట్టుకొని ఓట్లు రాల్చుకోవడానికి కాదని వారు చెప్పదలచుకొంటే, తాము కాని, తమ పుత్రరత్నాలు గానీ తమ కుటుంబంలో మరెవరూ కూడా వచ్చేఎన్నికలలో పోటీ చేయబోమని ప్రకటిస్తే వారిని విశ్వసించవచ్చును. కానీ కోటి విద్యలు కూటి కొరకేనని వారి ఆరాటం అంతా కూడా వచ్చే ఎన్నికలలో గెలిచేందుకేనని అర్ధం చేసుకొని జాలిపడాలి అంతే.