హనుమంతన్నకి "గా" పోస్టర్ నచ్చలే..!

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఏం చేసినా అది పెద్ద వార్త అవుతూ ఉంటుంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం..బుర్రకి ఏం తోస్తే అది చేయడం ఆయన స్టైల్. ఈ విషమంలో ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన వెనక్కు తగ్గరన్నది అందరికీ తెలిసిందే. అచ్చం అలానే చేశారు హనుమంతు..పెళ్లిచూపులు తర్వాత విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ట్రైలర్‌కి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్‌తో విజయ్ చేసిన లిప్‌లాక్ సీన్‌ ప్రజంట్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. ఈ ఒక్క సీన్‌తో మూవీపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చాయి. చిత్ర యూనిట్ కూడా లిప్‌లాక్ ఉన్న పోస్టర్స్‌నే ప్రమోషన్‌కి వాడుకొంటోంది.

 

అయితే ఇది హనుమంతన్నకి నచ్చలేదు..గాంధీభవన్‌లో జరిగిన ఒక సమావేశానికి హాజరైన వీహెచ్.. తిరిగి వెళుతుండగా ..ఓ ఆర్టీసీ బస్సు మీద అసభ్యకరంగా ఉన్న అర్జున్ రెడ్డి పోస్టర్‌ను చూశారు. దీంతో ఆయన వెంటనే బస్సు ఆపించి కండక్టర్ సాయంతో పోస్టర్‌ను చించేశారు. అనంతరం ఇలాంటి సినిమాలు, పోస్టర్స్ ద్వారా జనాలకి ఏం సందేశం ఇస్తారు అంటూ నిప్పులు చెరిగారు. యువతను ఇవి తప్పుదోవ పట్టిస్తాయని..డబ్బు కోసం ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలను ప్రొత్సహించకూడదని వీహెచ్ పేర్కొన్నారు. ఆయన పోస్టర్‌ను చించుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.