రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పాపాలు… ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి!  

భారతదేశంలో రాజకీయంగా ఓ విచిత్రమైన స్థితి వుంటుంది. అదేంటంటే… ఇప్పుడున్న సమస్యల్ని దేన్ని బాగా తవ్వి చూసినా… మూలంలో కాంగ్రెస్ హస్తం వుంటుంది! దేశాన్ని అత్యధిక కాలం దిల్లీలో, రాష్ట్రాల్లో ఏలిన అతి పురాతన పార్టీ అదే! కాబట్టి అన్ని అద్భుతాల వెనుక కాంగ్రెస్ వున్నా వుండకున్నా అన్ని అద్వాన్నాల వెనుక మాత్రం హస్తం… హస్తం వుండే తీరుతుంది! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విభజన చర్చ కూడా పదేపదే చేయి గుర్తు వైపే వేలెత్తి చూపుతోంది!

 

 

ఒకవైపు మోదీ, మరోవైపు చంద్రబాబు మోహరించి ఇప్పుడు ప్రత్యేక హోదా రణ రంగం చేస్తున్నారు. ఏపీలో అయితే కాంగ్రెస్ కు వున్నది సున్నా ఎమ్మెల్యేలు కాబట్టి పెద్దగా చర్చే లేదు. కేంద్ర స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి అడపాదడపా ఏపీ ప్రత్యేక హోదా అంటూ మాట్లాడుతుంటారు. రాహుల్, మన్మోహన్ సహా అందరూ హోదా ఇవ్వాల్సిందేనంటారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా కూడా హస్తం నేతలు లోక్ సభ, రాజ్యసభల్లో ఆంద్రా డిమాండ్లకు అండగానే నిలిచారు. ఇదంతా చూసి కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ వుందని భ్రమిస్తే మనల్ని ఎవరూ కాపాడలేరు. ఎందుకు ఇలా అనాల్సి వస్తుందంటే… అసలు ఇప్పుడున్న అన్ని చిక్కుముళ్లకి కారణమే కాంగ్రెస్ కాబట్టి! ప్రత్యేక హోదాకు ఆనాటి ప్రధాని మన్మోహన్ ఒప్పుకుని కూడా బిల్లులో అధికారికంగా పెట్టలేదు. అదే ఇప్పుడు మోదీ సర్కార్ కి వరంగా మారింది. అదికారికంగా ఇవ్వని హామీ తీర్చకున్నా ఏమీ అనటానికి వీల్లేని పరిస్థితి. దీన్ని కాంగ్రెస్ తప్పు కాక మరెవరిది అనగలం?

 

 

తమ పదేళ్ల ప్రభుత్వ కాలంలో చిట్ట చివరి సమావేశాల రోజున సభలో తలుపులు వేసి రాష్ట్ర విభజన చేసిన సోనియా సేన… కావాల్సినన్ని చారిత్రక తప్పులు చేసింది. బిల్లులో హోదా గురించి ఎలాంటి హామీ ఇవ్వని యూపీఏ సర్కార్ మరో దారుణం కూడా చేసింది. ఏపీలోని 175 ఎమ్మెల్యే స్థానాల్ని 225కి పెంచాలని విభజన చట్టంలో పెట్టారు. కానీ, అది సాధ్యమేనా? 2026 వరకూ నియోజక వర్గాల పెంపు ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు కాదు. రాజ్యాంగం అందుకు ఒప్పుకోదు. ఈ మాట చెబుతోన్నది ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగిన యూపీఏ ప్రభుత్వ మంత్రి చిదంబరం! తాజాగా జరిగిన స్థాయి సంఘం సమావేశంలో ఆయనని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇదే విషయమై నిలదీశారు కూడా! చిదంబరం చక్కగా మౌనం దాల్చారు తప్పు జవాబు ఇవ్వలేదు!

 

 

రాజ్యాంగం ఒప్పుకోదని తెలిసీ, 2026 వరకూ ఎమ్మెల్యే సీట్ల పెంపు కుదరదనీ తెలిసి… కాంగ్రెస్ ఆ హామీని బిల్లులో పెట్టింది. ఇప్పుడు అదే పార్టీకి చెందిన చిదంబరం నిర్మోహమాటంగా వీలు కాదని చెబుతున్నారు. ఇలాంటి పనులే హస్తం పార్టీ ఎప్పుడూ చేస్తూ వస్తుంటుంది! పైగా అటు హోదా రాకపోవటానికి, ఇటు నియోజక వర్గాల పెంపు జరగకపోవటానికి కారణమైన పార్టీనే మళ్లీ మేము ఆంధ్రాను ఆదుకుంటామని ప్రకటనలు చేస్తోంది. యూపీఏ సర్కార్ వస్తే ఏపీ స్పెషల్ స్టేటస్ ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతన్నారు! వీళ్లని ఏపీ ఓటర్లు నమ్ముతారా? రాష్ట్రంలోని ఏ పార్టీ హస్తంతో చేయి కలపటానికి సిద్ధంగా లేకపోవటమే పరిస్థితికి అద్దం పడుతుంది! ఇష్టానుసారం విభజన చేసి, లోపభూయిష్టంగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఆంధ్రాలో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆకులు పట్టుకుందామన్నా లాభం లేని స్థితిలో వుంది. మరోవైపు ఏపీలో ఎదిగే అవకాశం వున్నా బీజేపీ మొండి వైఖరితో స్వయంకృతాపరధం చేస్తోంది. మొత్తానికి సమీప భవిష్యత్ లో రెండు జాతీయ పార్టీలు ఆంధ్రాలో సున్నాలకే పరిమితం కాక తప్పకపోవచ్చు!