అప్పుడు బీజేపీ, ఇప్పుడు టీఆర్ఎస్.. కాంగ్రెస్ మార్క్ రాజకీయం

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుండగా ప్రధాన రాజకీయ పార్టీల్లో హైటెన్షన్‌ నెలకొంది. ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని ప్రధాన రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అధికారం కోసం తెరవెనుక తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యంగా కాంగ్రెస్.. ఒకవేళ హంగ్ ఏర్పడితే ఏం చేయాలా? అని తెరవెనుక వేగంగా పావులు కదుపుతోంది. కర్ణాటక తరహా వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనికోసం కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మంత్రి డీకే శివకుమార్‌ను అధిష్ఠానం రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఈమధ్య కర్ణాటక ఎన్నికల్లో కూడా హంగ్‌ అసెంబ్లీ ఏర్పడింది. ఆ ఎన్నికల్లో బీజేపీ పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ మాత్రం రాలేదు. జేడీఎస్‌, కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. అయితే గవర్నర్ మాత్రం‌ రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం బీజేపీ నేత యడ్యూరప్పను సీఎంగా నియమించారు. విశ్వాస పరీక్ష సందర్భంగా కాంగ్రెస్‌ , జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ వైపుకు వెళ్లకుండా చేయడంలో డీకే శివకుమార్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో ఆయన పేరు కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టిలో పడింది. ట్రబుల్‌ షూటర్‌గా పేరు తెచ్చుకున్న డీకేను.. ఇప్పుడు తెలంగాణలో రంగంలోకి దింపడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒక వేళ హంగ్‌ ఏర్పడితే డీకే ఎలాంటి వ్యూహం అనుసరించనున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరి ఒకవేళ హంగ్ వస్తే కర్ణాటకలో బీజేపీని అధికారానికి దూరం చేసినట్టు.. తెలంగాణలో టీఆర్ఎస్ ని అధికారానికి దూరం చేయడంలో డీకే విజయం సాధిస్తారో లేదో చూడాలి.