ఇప్పుడైనా భద్రత పెంచండి..

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు భద్రత పెంచాలని ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ గౌడ్‌ డీజీపీని కోరారు. ఈ మేరకు ఆయన ఈరోజు డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిశారు. అనంతరం మాట్లాడుతూ..పోలింగ్‌కు భద్రత ఇవ్వలేదని,రేపు కౌంటింగ్‌ సమయంలోనైనా సమస్యాత్మక  కేంద్రాల్లో ముందస్తుగా భద్రత కల్పించాలని డీజీపీని కోరామన్నారు.  టీఆర్‌ఎస్‌ నేతలు ఓటమి భయంతో దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. తమ పార్టీ నేతలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరినట్లు మధుయాష్కీ వెల్లడించారు. పోలింగ్ సమయంలో కాంగ్రెస్ నాయకులపైన జరిగిన దాడులకు సంబంధించి కేసులపై తీసుకున్న చర్యల గురించీ అడిగి తెలుసుకున్నామన్నారు.

తాము ముందు నుంచి చెప్పిన్పటికీ భద్రత పెంచలేదని, అందువల్ల తనతోపాటు పొన్నం ప్రభాకర్, వంశీచంద్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని డీజీపీకి వివరించామన్నారు. వంశీచంద్‌, రోహిత్‌రెడ్డి, మరికొంతమంది కాంగ్రెస్‌ నేతలకు భద్రత కల్పించాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. అందరికీ సమన్యాయం చేయాలని డీజీపీని కోరామని మధుయాష్కీ వెల్లడించారు. దీనిపై స్పందించిన మహేందర్‌ రెడ్డి బాధ్యులపై చర్యలు తీసుకుని, వారికి భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీలను ఆదేశించారు. డీజీపీ తో భేటీలో మధుయాస్కీతో పాటు ఆ పార్టీ నేతలు గూడూరు నారాయణ రెడ్డి, హర్కర వేణుగోపాల్ పాల్గొన్నారు.