కాంగ్రెస్ నేతలు ప్రజలతో టచ్చులోనే ఉన్నారు గురూ

 

మన మెగామంత్రి చిరంజీవి మహోదయులు మీడియా ముందుకు వచ్చి హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయవలసిన అవసరం గురించి తడబడుతూనే అనర్గళంగా ఒక ఉపన్యాసం ఇచ్చేసి మాయమయిపోతే, ఆ తరువాత ఆ స్థానంలోకి ఏ సబ్బంహరో లేక కిల్లి రాణీగారో ముందుకు వచ్చి మైకు పట్టుకొని సీమాంధ్ర ప్రజలపై తమ కృపా కటాక్షాలు కురిపించి మళ్ళీ కొన్ని రోజులు కనబడకుండా మాయమయిపోతారు. మధ్య మధ్యలో మన లగడపాటి రాజగోపాల్ గారు ప్రత్యక్షమవుతూ గంటలకొద్దీ అనర్గళంగా ఏవేవో మాట్లాడేసి ప్రజలను కన్ ఫ్యుస్ చేసేస్తుంటారు.

 

వారి మధ్యలోకి టామ్ అండ్ జెర్రీలాగ మన బొత్ససత్యనారాయణ, జేసీ దివాకర్ రెడ్డి ఎంటరయి కాసేపు హడావుడి చేసి అందరికి కితకితలు పెట్టి మాయమయిపోతుంటారు. ఇక రాష్ట్ర విభజన గురించి గుర్తొచ్చినప్పుడల్లా పాపం! మన ఆనం బ్రదర్స్ వచ్చి తమకు తోచినదేదో మాట్లాడుతూనే ఉన్నారు. గనుక, వారిని తప్పుపట్టడానికి కూడా లేదు. ఈ విధంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ ఒకరి తరువాత మరొకరు వంతులు వేసుకొని జనాలతో పూర్తి టచ్చులో ఉంటూనే మళ్ళీ అదే జనాలకి ఎక్కడా దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప టెక్నిక్కేనని జనాలు సైతం ఒప్పుకొంటున్నారు కూడా.

 

పాపం! ఈ టెక్నిక్ ఆకళింపుజేసుకోలేని పెద్దాయన కావూరి సాంభశివరావు వంటి అమాయక మంత్రులు మాత్రం పంచె ఎగేసుకొని జనం మధ్యకి వెళ్లి కోడిగుడ్లతో సన్మానం చేయించుకొని ఆగ్రహంతో “ఒరే! సన్నాసుల్లారా! అర్ధ రూపాయికి కూడా కక్కుర్తి పడే వెదవాల్లారా...ఆ...లంచాలు పెట్టందే ఏ పని చేయని వెదవల్లారా...ఆ...నా మీదే కోడిగుడ్లు విసురుతారా? దమ్ముంటే దగ్గరకి రండి..మీ పని చెపుతాను..”అంటూ పోలీసుల చాటున నిలబడి మైకు పట్టుకొని రంకెలు వేస్తుంటే జనాలు ఆయన తిట్లు విని కోపం తెచ్చుకోకుండా “పాపం! మంత్రిగారు” అంటూ ముసిముసి నవ్వులు నవ్వుకొంటూంటే, ఆయన మాత్రం ఫీలవరూ పాపం!

 

అయితే కాంగ్రెస్ పార్టీలో అందరూ ఆయనంత అమాయకులేమీ ఉండరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొన్న కిల్లి రాణీవారు ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబుని, ఆయన అనుచరులకి “మీ లిమిట్స్ గుర్తుంచుకోండి” అని ఘాటుగా వార్నింగ్ ఇచ్చేసిన తరువాత, తను సమైక్యవాదిననే మరో మారు కన్ఫర్మ్ చేసేసి మాయమయిపోయారు. "రాక రాక వచ్చిన కేంద్రమంత్రి పదవిని చస్తే వదులుకోనని" బల్లగుద్ది చెప్పిన మన జేడీ శీలంగారు ఇక తనను రాజీనామా చేయమని ఎవరూ డిమాండ్ చేయరని రూడీ చేసుకోన్నాక, ఈ మధ్యనే మీడియా ముందుకు వచ్చి సమైక్యం కోసం "నేను రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని" డిక్లరేషణ్ ఇచ్చేసి మాయమయిపోయారు.

 

ఇప్పుడు ఆయన స్థానంలోకి వచ్చిన వైజాగ్ కాంగ్రెస్ యంపీ పురందేశ్వరిగారు, “ఉమ్మడి రాజధాని కాన్సెప్ట్ మన రాజ్యాంగంలోనే లేదు. నేను అన్ని సమస్యలను వివరిస్తూ మా సోనియమ్మకు, మన్మొహనుల వారికి రెండు ఉత్తరం ముక్కలు కూడా వ్రాసిపడేశాను. వాళ్ళు పంపిన టీ-బిల్లులో  ప్రింట్ కూడా సరిగ్గా లేదని వాటిలోనే నాలుగక్షరాలు గీకి పడేసాను. అందువల్ల మీరిక నిశ్చింతగా ఉండండి. ఇదివరకు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడితేనే వినని మావాళ్ళు ఇప్పుడు నేను వ్రాసి పడేసిన ఈ ఉత్తరం ముక్కలను మాత్రం పట్టించుకొంటారా? వాటిని చింపి చెత్త బుట్టలో పడేయారా? అని వెర్రిమొర్రి ప్రశ్నలు వేసి నన్ను తికమక పెట్టకండి. ఒకవేళ వారు నాఉత్తరం ముక్కలని పట్టించుకోకపోతే, నేను కూడా తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఓటేయకుండా వచ్చేస్తాను. మదర్ ప్రామిస్! అని సీమాంధ్ర ప్రజలకు ప్రామిస్ చేసేసిన తరువాత, ఆమె  కూడా మళ్ళీ జనాల మధ్య నుండి మిస్ అయిపోయారు. జనాలు.. జనాలు...తరువాత ఎవరు మాట్లాడుతారో మీకేమయినా తెలిస్తే చెప్పి పుణ్యంకట్టుకోరా... ప్లీజ్!