టీఆర్ఎస్ లో చేరిన వంటేరు.. ఎన్నికల్లో గెలవాలనే అలా చేశా!!

 

కాంగ్రెస్‌ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. ప్రతాప్‌రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారని నిన్నటి నుంచి పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారని ఆయన కుమారుడు కూడా నిన్న ప్రకటించారు. అయితే అవన్నీ ఊహాగానాలని, ప్రతాప్‌రెడ్డిని టీఆర్ఎస్ లోకి ఎవరూ ఆహ్వానించలేదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. పార్టీలోకి ఆయన వచ్చినా రానివ్వబోమని వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలో టీఆర్ఎస్ లో తాను చేరుతున్నట్లు వంటేరు ఈ ఉదయం స్వయంగా ప్రకటించి.. తాజాగా పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ప్రతాప్‌రెడ్డి తెలిపారు.

గతంలోనే టీఆర్‌ఎస్‌లో చేరి ఉంటే ఎంతో బాగుండేదని ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీలోకి రావాలని గతంలోనే మూడు సార్లు కేటీఆర్‌ కోరారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలవాలనే పోరాటం చేశా.. కేసీఆర్‌పై వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్‌వైపే ఉన్నారన్నారు. రైతాంగమంతా కేసీఆర్‌కే ఓటేశారని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలకు చేరాయన్నారు.

వంటేరుకు టీఆర్ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు నిజంగానే అదృష్టవంతులు అని పేర్కొన్నారు. గజ్వేల్‌లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఆలస్యంగానైనా వంటేరు ప్రతాప్ మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. వంటేరు చేరికతో గజ్వే‌ల్‌‌లో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారింది అన్నారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్లలో నీళ్లు ఇవ్వబోతున్నామన్నారు. 'కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీరుతాం. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే బంగారు తెలంగాణ కల సాకారం అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రాన్ని మనమే శాసించాలి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలి. ఇందుకు ప్రతి కార్యకర్త సహకారం అందించాలి' అని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు.