తెలంగాణలో సివిల్ వార్..! రేవంత్ సంచలన వ్యాఖ్యలు

 

తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులు సివిల్ వార్ కి దారి తీసేలా ఉన్నాయంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకున్న... ఊహించిన తెలంగాణ ప్రస్తుతం లేదని... ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే... సివిల్ వార్ కు పరిణామాలు దారి తీస్తాయేమోనన్న ఆందోళన కలుగుతోందన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనతోనే ఈ పరిస్థితులు వచ్చాయన్నారు. నిజంగానే కేసీఆర్ పాలన బాగుంటే... నిజామాబాద్ లో కవిత ఓడిపోవడమేంటని.... తాను మల్కాజ్ గిరిలో గెలవమేంటని ప్రశ్నించారు. సమాజంలో అరాచకం పెరిగిపోయినప్పుడు... పాలకుల్లో నియంతృత్వం పెచ్చుమీరినప్పుడు ప్రకృతే రంగప్రవేశం చేస్తుందనడానికి ఇదే రుజువు అన్నారు. 

అసలు తాను కొడంగల్ లో ఓడిపోతానని గానీ... అలాగే మల్కాజ్ గిరిలో గెలుస్తానని గానీ అనుకోలేదన్నారు. గతంలో అభివృద్ధికి నక్సలైట్లు అడ్డని... సమాజంలో వాళ్లుండకూడదని రైటిస్టులు భావించేవారని, కానీ... నక్సలైట్లు ఉండుంటే... ఇప్పుడు ప్రభుత్వ చర్యలను నియంత్రించేవారని సమాజం అనుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తాము చెప్పలేదంటున్న కేసీఆర్.... మరి 50శాతం ప్రైవేటీకరిస్తామని చెప్పారా అంటూ నిలదీశారు.