కాంగ్రెస్ లో కలకలం.. దానం నాగేందర్‌ కు పరోక్ష సాయం

 

తెలంగాణలో కాంగ్రెస్‌ సీట్ల కేటాయింపుపై రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో కురుమ, యాదవ సంఘాల అధ్యక్షులతో కలిసి ఆయన.. టిక్కెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్‌లో జరుగుతున్న అన్యాయాలను మీడియాకు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ కురుమ, యాదవులను విస్మరించిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో దానం నాగేందర్‌ను గెలిపించేందుకే దాసోజు శ్రవణ్‌ను అక్కడ బరిలో దించారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో కోట్లకు సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని అన్నారు. ఇబ్రహీంపట్నం టిక్కెట్ కోసం కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌ తనను రూ.3కోట్లు డిమాండ్‌ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వీటికి సంబంధించిన ఆడియో టేపులను విడుదల చేస్తామని అన్నారు. రాహుల్‌ ఆశయానికి విరుద్ధంగా రాష్ట్రంలో టికెట్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో సీనియర్‌ నేతలకు కాకుండా కొత్త కొత్తవారికి, బంధువర్గానికే సీట్లు ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు దొంగల ముఠాగా వ్యవరిస్తున్నారనిమండిపడ్డారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒక దేవుడు, తండ్రిలా భావించానని, నీతి, నిజాయితీ పరుడుగా భావించానని, ఆయనకు విధేయుడుగా ఉంటే.. ఉత్తమ్ మాత్రం నీళ్లు పోయకుండా తన గొంతు కోశారని క్యామ మల్లేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉత్తమ్ నీ గొంతు తెలంగాణ ప్రజలు కోస్తారు, నిశ్వర్థపరుడనైన నా గొంతు కోయడం ఎంత వరకు సమంజసం’ అని ఆయన మీడియా వేదికగా ప్రశ్నించారు.