కొత్త చిక్కుల్లో కాంగ్రెస్... వరంగల్ జిల్లా సహకార బ్యాంకు రుణాల్లో అవినీతిపై విచారణ!!

ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డీసీసీబీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. పంట రుణాలు లీజుల పేరుతో 7 కోట్ల 90 లక్షల వరకు అవినీతి జరిగిందనే ఆరోపణలు రెండేళ్ల క్రితం కలకలం రేపాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జంగా రాఘవరెడ్డి బ్యాంకు చైర్మన్ గా ఉన్న సమయంలో అక్రమాలకు గేట్లు ఎత్తారని విమర్శలు ఆనాడు చుట్టుముట్టాయి. ఆయన 2013 నుంచి 2017 వరకు బ్యాంక్ చైర్మన్ గా ఉన్నారు. ఆనాటి అక్రమాల అంతు తేల్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం.. విచారణను సీఐడీకి అప్పగించింది. దీంతో జిల్లాలో ఈ అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. 

రెండేళ్ళుగా పెండింగ్ లో ఉన్న కేసు ఒక్కసారిగా దుమ్ముదులపడం ఏమిటనేది మొదటి ప్రశ్న.. అయితే ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది రెండో అంశంగా మారింది. సీఐడీ నెట్ పరిధిలోకి ఎవరెవరు వస్తారో అనేది మూడో ప్రశ్నగా జనం చర్చించుకుంటున్నారు. మరోవైపు మునిసిపల్ ఎన్నికల హడావుడి నుండి ఇంకా బయటకు రాని జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ ఆదేశాల గురించి తెలుసుకొని ఒకింత టెన్షన్ పడుతున్నారు. ఈ విచారణ ద్వారా జంగా రాఘవరెడ్డినే లక్ష్యంగా చేసుకున్నారా లేక ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాక్టివ్ గా ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా టార్గెట్ పెట్టారా అనేది ఉత్కంఠ రేపుతోంది. 

జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న జంగా రాఘవ రెడ్డి మునిసిపల్ ఎన్నికల్లో అన్నీ తానై కాంగ్రెస్ కు వ్యవహరించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావుపై పాలకుర్తిలో పోటీ చేసి ఓడిపోయారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు సన్నిహితుడిగా ఆయన అండదండలతో పార్టీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవరెడ్డి. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా కొండామురళి, సురేఖ పేర్లు వినిపించాయి. కొండా మురళీ అనుచరుడిగానే కాంగ్రెస్ లోకి అడుగుపెట్టారు జంగా రాఘవ రెడ్డి. కొండా దంపతులు అనేక పార్టీలు తిరిగి తిరిగి ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ కాగా రాఘవ రెడ్డి మాత్రం వారితో సమానంగా రాజకీయం చేసే ఎత్తుకు ఎదిగారని పార్టీలో టాక్. ముఖ్యంగా జనగామ జిల్లాలో జంగాకు చెక్ చెప్పాలని భావిస్తున్న మంత్రి దయాకర్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ఒత్తడి తెచ్చి రాజకీయంగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం పాలకుర్తి కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గ్రామీణ స్థాయిలో కమిటీలు వేసి ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతున్నారు. జంగాకు ధీటుగా ఎర్రబెల్లి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ జనాలను కలుస్తున్నారు. దీంతో జంగాతో ఎప్పటికైనా ప్రమాదమని భావించిన మంత్రి ముందు గానే బ్రేకులు వేసేందుకు సిద్ధపడ్డారని జనాల టాక్. ఒక్క జంగానే కాదు సీఐడీ విచారణ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాక్టివ్ గా ఉన్న కాంగ్రెస్ నేతలందరికీ టీఆర్ఎస్ ఝలక్ ఇవ్వబోతున్నట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో బలపడేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఆది లోనే వారి దూకుడుకు బ్రేక్ వేయాలన్న చూస్తోంది అధికార పార్టీ. అయితే డీసీసీబీ రూపంలో వారికి అవకాశం చిక్కడంతో దానిని వినియోగించుకోవాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.