రెండు నాల్కల రాజకీయ నాయకుడు?

 

మంత్రి పదవి ఇవ్వలేదని అలిగి కాంగ్రేసుకి దూరంగా తిరుతున్న ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంభశివరావుగారు మొన్న ఆదివారంనాడు హైదరాబాదులో జరిగిన పార్టీ సమావేశానికి కూడా హాజరు కాలేదు. కానీ, ఆమర్నాడు అంటే, సోమవారంనాడు గుంటూరు ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయంలో జరిగిన సమైక్యాంధ్రసభకి మాత్రం హాజరయి తెలంగాణారాష్ట్రం పేరిట వేర్పాటు ఉద్యమాలు నడుపుతున్న కేసిర్ మరియు అతని పార్టీవారినీ తిట్టిన తిట్టు మళ్ళీ తిట్టకుండా మరీ తిట్టారాయన. అయితే, ఆ ఉద్రేకంలో కావూరివారు సెల్ఫ్ గోల్ చేసుకొని తనని తానూ ఏవిదంగా బయట పెట్టుకోన్నారో చూద్దాము.

 

కావూరివారు ఉద్రేకంగా ఉపన్యాసం చేస్తూ “తెలంగాణాలో కొందరు రాజకీయ నిరుద్యోగులు తమ ఆదాయవనరులు పెంచుకోవడానికి చేస్తున్న ఉద్యమం అది. ఒకవేళ, తెలంగాణాగానీ సాదించగలిగితే వారే అధికారం చేప్పట్టి మరింతగా దోచుకొందామనే దురాలోచనతోనే వారంతా తెలంగాణా ఉద్యమం చేస్తున్నరిప్పుడు. ఒకప్పుడు చంద్రబాబు వెనుక తిరిగిన కేసిర్ కి అప్పుడు తెలంగాణారాష్ట్రం అవసరమని ఎందుకు అనిపించలేదు? అప్పుడు ఆయన ఎందుకు గట్టిగా అడుగలేదు? చంద్రబాబు ప్రభుత్వంలో అతనికి మంత్రి పదవిరానందునే అతను పార్టీనుండి బయటకివచ్చి తన రాజకీయ ఉపాది కోసం ఈ తెలంగాణాఉద్యమం మొదలుపెట్టాడు. తద్వారా అతను, అతని పార్టీలో వారు హైదరాబాదు చుట్టుపక్కల సీమంద్రావారిని బెదిరించి కోట్లాదిరూపాయలు పోగేసుకొన్నారు. మళ్ళీ, తెలంగాణారాష్ట్రం గానీ ఏర్పడితే, తానూ తన పార్టీ కలిసి అధికారం పంచుకొని మరిన్నివందలకోట్లు వెనకేసుకోవాలని చూస్తున్నాడు. తెలంగాణా ఉద్యమాల పేరిట రాష్ట్రంలోఒక అనిశ్చిత పరిస్తితిని సృష్టించేరు వాళ్ళు. తన స్వార్దరాజకీయప్రయోజనాల కోసమే కేసిర్ ఇదంతా చేస్తున్నాడు. ఒకవేళ కేంద్రంగానీ అతని ఒత్తిడికి లొంగిపోయి తెలంగాణా రాష్ట్రం ప్రకటించడానికి సిద్దం అయినట్లయితే, మనమూ అందుకు దీటుగా ఉద్యమాలు చేప్పటి రాష్ట్ర విభజనని అడ్డుకోవాలి. అవసరమయితే సమైక్యాంధ్ర కోసం నేను ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు కూడా వెనుకాడను. రాష్ట్రం విచ్చినం కాకుండా కాపాడుకోవలసిన బాధ్యతా మన అందరిపై ఉంది.”

 

కేసిర్ ని అయన ఉద్యమాలని నోరార తిట్టిపోసిన కావూరివారు ఇక్కడ కొన్నివిషయాలు ప్రజలు గుర్తించబోరని ధీమాగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.

 

తనకే గనుక కేంద్రంలో మంత్రిపదవి ఇచ్చిఉంటె తానీ రోజు కాంగ్రేసు నుండి బయటకి వచ్చే ఆలోచన చేసేవారా? వచ్చి ఈ రకమయిన ఉద్యమాలు, పార్టీలు అనేవారా? ఆనాడు కేసిర్ కి మంత్రిపదవి రాకపొతే ఆయన ఏమిచేసాడని చెపుతున్నారో, ఇప్పుడు కావూరివారు అదే చేస్తామని చెపుతున్నారు.

 

మంత్రిపదవి రాకనే కదా ఆయన ‘కొల్లేరు సరస్సు సమస్యపై ఉద్యమం’ మళ్ళీ మొదలుపెట్టి రాస్తారోకోలు, రైల్రోకోలు చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని మొన్ననే కదా ఆయన ప్రకటించేరు. అంతేగాకుండా ఇప్పుడు తెలంగాణా ఉద్యమాన్ని అడ్డుకొనేందుకు తానూ కూడా కొత్తగా ‘సమైక్యాంధ్ర కోసం’ ఒక కొత్తపార్టీనీ పెట్టి ఉద్యమాలు చేస్తానని చెప్పి అయన కేసిర్ చేస్తున్న పనినే కదా తానూ చేస్తామని ప్రకటించుకొంటున్నారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్తితిని సృష్టించేడని ఒక వైపు కేసిర్ ని ఆయన పార్టీని తెడుతూనే తానూ అదే పనిని ఇప్పుడు ఎందుకు చేయాలనుకొంతున్నారో ఆయనే చెప్పాలి.

 

రాజకీయనిరుద్యోగులే ఇటువంటి ఉద్యమాలు చేస్తునారని కేసిర్ ని ఆడిపోసుకొన్న కావూరివారు కూడా మరి కాంగ్రేసుని వదిలిబయటకి వచ్చి తానూకూడా రాజకీయనిరుద్యోగిగా మారడం వల్లనే కదా ఇప్పుడు ఈ ఉద్యమాలు, పార్టీలు అంటున్నారు?

 

ఆయనే చెప్పినట్లు అలనాడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవికోసం తెలంగాణా ఉద్యమం మొదలుపెట్టి పదవిరాగానే తన ఉద్యమాన్ని పక్కనపడేసినట్లే, రేపు కావూరివారికి కూడా యు.పీ.యే. ప్రభుత్వం పిలిచి కేంద్రమంత్రిపదవి ఇస్తే, అప్పుడు ఆయన అది వద్దని ఉద్యామాలు చేసుకొంటారో లేక తన ఉద్యామాలని పక్కనపెట్టి మంత్రి పదవి చేపడతారో ఆయనే చెప్పాలి?

 

ఎంత అనుభవంఉన్న రాజకీయనాయకుడయినా ఈ విదంగా రెండు నాల్కల దొరణితో ప్రజలని మభ్య పెట్టదలిస్తే అది అయన రాజకీయ భవిష్యత్తుకే చేటుతెస్తుంది. ప్రజలు ఒట్టి వెర్రివాళ్ళు వాళ్ళకి మన మాటే వేదం అనుకొనే ఇటువంటి రాజకీయనేతలకి మన దేశంలో కరువులేదు. ప్రజలే అటువంటి వారికి ఎన్నికలలో సరయిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుంది.