టీఆర్ఎస్ నేతకు ఫోన్ చేసి మద్దతు కోరిన కాంగ్రెస్ ఎంపీ.!

 

తెలంగాణలో ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందే రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు తెరతీసిందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. రాష్ట్రంలో హంగ్‌ రాబోతోందని, కాంగ్రెస్‌లోకి రావాలని.. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తనకు ఫోన్ చేసి కాంగ్రెస్‌లోకి రమ్మని ప్రలోభ పెట్టారని నాగర్‌కర్నూలు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ బాల్కసుమన్‌, ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్‌తో కలిసి జనార్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ మధ్యాహ్నం 2.07 గంటలకు విశ్వేశ్వర్‌రెడ్డి ఫోన్‌ చేశారని చెప్పారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని తనను అభ్యర్థించారన్నారు. అలాంటి విషయాలు తన వద్ద చెల్లవని, ఈ ప్రస్తావన తన వద్ద తీసుకురావొద్దని తాను తిరస్కరించినట్లు జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. తాము కేసీఆర్ సైన్యంలో ఉన్నామని, టీఆర్ఎస్ కు 80 నుంచి 90 సీట్లు వస్తాయని, ఇలాంటి నీచమైన ప్రలోభాలు మంచివి కావని విశ్వేశ్వర్ రెడ్డి తో చెప్పానని పేర్కొన్నారు. రెండు సార్లు ఫోన్ చేసినా అదే చెప్పానన్నారు. చంద్రబాబు దర్శకత్వంలోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్‌ను ఎవ్వరూ వీడే ప్రసక్తి లేదని చెప్పారు. ఇలాంటి చేష్టలు కాంగ్రెస్ మానుకోవాలని హెచ్చరించారు.