హరీష్‌పై కాంగ్రెస్ కన్ను!

 

congress eye on Harish Rao, telangana, ktr, rayala telangana, kcr, telangana bill

 

 

రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తాను చేసిన రిస్క్ కి తగిన ప్రతిఫలం వుండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేసిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాను ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఎంతమాత్రం ఇష్టపడటం లేదు. తెలంగాణను ప్రకటించగానే కేసీఆర్ టీఆర్ఎస్‌ని కాంగ్రెస్‌లో కలిపేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలీయమైన శక్తిగా మారుస్తాడని ఆశించిన కాంగ్రెస్ అధిష్ఠానం అలా జరగకపోవడంతో నిరాశకు గురైంది.

 

తెలంగాణ వచ్చాక తానే అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష టీఆర్ఎస్  వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. తనకు అధికారం దక్కనప్పుడు తెలంగాణ ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన ఒక దశలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ ఇచ్చినా తనకు మేలు జరిగేలా వుండేలా వ్యూహాన్ని కాంగ్రెస్ రచించింది. ఆ వ్యూహమే ‘రాయల తెలంగాణ’ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ బలం తగ్గించడం ద్వారా తాను అధికారంలోకి రావాలని కాంగ్రెస్ యోచిస్తోందని అంటున్నారు.



కాంగ్రెస్ అనుసరించే విభజించు, పాలించు సిద్ధాంతంలో భాగంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీనే విభజించే వ్యూహాన్ని ఆలోచిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కేటీఆర్‌తో తనకున్న రాజకీయ విభేదాల కారణంగా గతంలో హరీష్‌రావు కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ ఆకస్మిక మరణంతో ఆ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడింది.



తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశాలు కనిపించడంలో హరీష్, కేటీఆర్ మధ్య ముఖ్యమంత్రి సీటు కోసం పోటీ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావును ఆకర్షించి కాంగ్రెస్ పార్టీలో చేర్చడం వల్ల తెలంగాణలో విశేషమైన స్థాయిలో ఓటుబ్యాంకు సాధించుకోవడంతోపాటు టీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా చావుదెబ్బ తీసే అవకాశం వున్నట్టు కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హరీష్‌ని కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.