చేతులు కాల్చుకున్న హస్తం... ఆకులు పట్టుకుంటోంది!

ఇప్పుడు ఏపీలో అత్యంత దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది ఎవరు అంటే… కాంగ్రెస్ అనే సమాధానమే వస్తుంది! 2014కు ముందు తెలుగు నేలపైన హస్తం అతి కీలకమైన పార్టీ! ఇప్పుడు కేవలం తెలంగాణకే పరిమితం. అదీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో క్లారిటీ లేదు. టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ శక్తిని తట్టుకుని కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ పీఠం ఎక్కటం అంత తేలిక కాదు. ఇక ఆంద్రా కాంగ్రెస్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అలా వుంది పరస్థితి.

 

 

గత ఎన్నికల్లో సున్నా సీట్లు సాధించిన కాంగ్రెస్ సీపీఎం, సీపీఐ లాంటి పార్టీలతో కూడా సమానంగా నిలవలేకపోయింది. అందుకు ఇష్టానుసారం చేసిన రాష్ట్ర విభజన ప్రధాన కారణంగా కాగా జగన్ పెట్టిన వేరు కుంపటి చేతి పార్టీ చేయికాలేలా చేసింది! ఇప్పుడు ఎన్ని ఆకులు పట్టుకున్నా పరిస్థితిలో మార్పు కనిపించేలా లేదు. గత నాలుగేళ్ల కాలంలో కూడా ఆంద్రా కాంగ్రెస్ రోడ్డెక్కి నిరసనలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయలేకపోయింది. ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో పార్లమెంట్ నడుస్తోంటే రెడీ మేడ్ రాజకీయం మాత్రం చేస్తోంది!

 

 

కేంద్రంలో వున్న బీజేపీ, రాష్ట్రంలో వున్న టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని రాహుల్ టీమ్ భావించింది. ఇంత వరకూ బాగానే వున్నా… ప్రస్తుతం ఆంధ్రా జనం ప్రధానమైన కోరిక ప్రత్యేక హోదా! దానిపై తగినంతగా స్పందించలేదు రాహుల్ గాంధీ. తన సుదీర్ఘ ప్రసంగంలో అనేక అంశాల గురించి మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు చివర్లో వెళ్లి మోదీని వాటేసుకుని కలకలం రేపాడు. ఆ గిమ్మక్కు తప్ప రాహుల్ ఏపీ హోదా గురించి మాట్లాడిన ఏ ఒక్క మాటా హైలైట్ కాలేదు. ఇదే కాంగ్రెస్ పట్ల ఆంధ్రా ఓటర్లకు ఏ మాత్రం నమ్మకం కలగకపోవటానికి కారణం!

ఇప్పుడు ఏపి వున్న పరిస్థితికి అసలు కారణం హస్తం పార్టీనే! 2009లో రాజేసిన రాష్ట్ర విభజన వివాదం సాగదీసీ సాగదీసీ 2014లో పార్లెమంట్ తలుపులు మూసి ముగించారు! ఆ దురుసు ప్రవర్తనే ఏపీ ఓటర్లలో కసి పెంచింది. సున్నా సీట్లు వచ్చేలా చేసింది. విభజన అనివార్యమైనప్పుడు యూపీఏ పాలనలోనే ఏపీకి తగిన వరాలు ఇచ్చి , కేటాయింపులు చేయాల్సింది. అవేమీ చేయకుండా కాంగ్రెస్ అడ్డంగా నరికి అవతల పారేసింది. ఆ ఫలితం కారణంగా తెలంగాణలోనూ అధికారానికి ఆమడ దూరంలో ఆగిపోయింది. రెంటికీ చెడ్డ రేవడైంది.

 

 

2014 ఎన్నికల ఫలితాలతో కూడా ఏమీ నేర్చుకోని కాంగ్రెస్ నాలుగేళ్లు నిద్రపోయింది. ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నేతృత్వంలో ఉధృత పోరు చేస్తోంటే కాస్త క్రెడిట్ కొట్టేసే పనిలో పడింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత కేవీపీ ప్రైవేట్ బిల్లు అంటూ ప్రకటన చేశారు. అలా ప్రవైట్ బిల్ పెట్టటం ద్వారా లాభం ఏంటి? అవిశ్వాస తీర్మానంలో టైంలో రాహుల్ చేత గట్టిగా ఆంధ్రాకు మద్దతు పలికించకుండా ఇప్పుడు ఎన్ని డ్రామాలు ఆడినా లాభం ఏంటి? చివరగా, కేవీపీ లాంటి అందరూ కాంగ్రెస్ నేతలు చెప్పేది ఏంటి? 2019లో యూపీఏ వస్తే ప్రత్యేక హోదాకు కృషి చేస్తాం! దీన్ని నమ్మాల్సిన అగత్యం ఆంధ్రులకు ఏముంది? 2014కు ముందు సోనియా చేతిలో న్యాయం చేసే అవకాశం వుంటేనే చేయని వారు ముందు ముందు ఎలా చేస్తారు? అసలు యూపీఏ వచ్చే అవకాశాలు ఎంత మాత్రం వున్నాయని?

 

 

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి చేర్చుకుని , ప్రత్యేక హోదా కోసం మేమూ కృషి చేస్తున్నామని సంకేతాలిచ్చే ప్రయత్నాలు చేస్తోన్న కాంగ్రెస్ కు ఈసారి కూడా ఏపీ ఓటర్ల దయా, దాక్షిణ్యాలు కష్టమే! సున్నా రాకుండా కాస్త ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే అదే అద్భుతం! ఎందుకంటే, పోయిన సారి టీడీపీ, వైసీపీ, బీజేపీ మాత్రమే వుంటే… ఈసారి జనసేన కూడా వచ్చి చేరింది. ఇన్ని పార్టీల్ని కాదని జనం హస్తాన్ని తెచ్చి తమ తల మీద ఎందుకు పెట్టుకుంటారు?