కాంగ్రెస్‌కి దగ్గొచ్చింది!

 

 

 

ఇప్పటికే అనేక అనేక రోగాలు, రొష్టులతో మంచాన పడే స్థితిలో వున్నరాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి మరో వ్యాధి కూడా తగులుకుంది. రాష్ట్ర కాంగ్రెస్‌కి అకస్మాత్తుగా ‘దగ్గు’ పట్టుకుంది. ఆ దగ్గుతో కాంగ్రెస్ నాయకులందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏ మందు వాడితే ఈ దగ్గు దగ్గుతుందో అర్థంకాక ఖళ్ళుఖళ్ళుమంటూ దగ్గుతూనే చికిత్స కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ని వేధిస్తున్న ఆ దగ్గు పేరు దగ్గుబాటి దంపతులు.

 

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరు మొదటి నుంచి దగ్గుబాటి దంపతులకు ఇబ్బందికరంగానే తయారైంది. మరోవైపు విశాఖ సీటు నాదేనని సుబ్బరామిరెడ్డి చేసిన నానా యాగీ ఈ దంపతులకు కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి కలిగేలా చేసింది. కేంద్ర మంత్రి హోదాలో వున్న దగ్గుబాటి పురంద్రీశ్వరి రాష్ట్ర విభజన విషయంలో కేంద్రానికి మద్దతు ఇచ్చారు. అయితే సీమాంధ్రుల హక్కులకు భంగం కలిగితే ఎంతమాత్రం సహించేది లేదని చెప్పారు. సీమాంధ్ర ప్రజల హక్కుల విషయంలో పురంద్రీశ్వరి చేసిన సూచనలన్నీ బుట్టదాఖలు చేసి కేంద్రం ఏకపక్ష బిల్లును రాష్ట్రానికి పంపింది. దీంతో తీవ్రంగా హర్టయిన దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ పార్టీ మీద విముఖతను మరింత పెంచుకున్నారు. వీరు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ఆలోచనలో వున్నారన్న అభిప్రాయాలు వారి అనుయాయుల నుంచి వ్యక్తమయ్యాయి.



నిజానికి సుబ్బరామిరెడ్డి తన యాగీకి ఫుల్‌స్టాప్ పెట్టకుండా వుండి వుంటే కాంగ్రెస్ పార్టీకి వీరిద్దరూ ఎప్పుడో గుడ్ బై కొట్టేసేవారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులుగా ప్రజల్లో తమకున్న గౌరవమే తమని రాజకీయాలలో విజయాలు సాధించేలా చేస్తోందే తప్ప, కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలు కాదని ఈ దంపతులు భావిస్తున్నారు. తాజాగా దగ్గుబాటి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టుగా, వారికి తెలుగుదేశం పార్టీ ఆహ్వానం పలుకుతున్నట్టుగా పర్చూరులో వెలిసిన ఫ్లెక్సీలు రాష్ట్ర రాజకీయ రంగంలో సంచలనం సృష్టించాయి. ఈ ఫ్లెక్సీలు ఎవరు పెట్టి వుంటారన్న విషయంలో కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దగ్గుబాటి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరడమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


రాష్ట్ర విభజనకు ఉత్సాహం చూపించి అడ్డంగా మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీలో వుంటే కుక్కతోక పట్టుకుని రాజకీయ గోదారి ఈదినట్టే అవుతుందని దగ్గుబాటి దంపతుల సన్నిహితులు భావిస్తున్నారు. ఈ దంపతులు తెలుగుదేశంలోకి రావడం రాష్ట్ర రాజకీయాలలో శుభ పరిణామమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చిన్న చిన్న ఇగోలు వదులుకోవడం తప్ప వీరు తెలుగుదేశంలోకి రావడానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని భావిస్తున్నారు. దగ్గుబాటి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ వస్తున్న వార్తలను కొంతమంది ఖండిస్తున్నప్పటికీ, నిప్పు లేకుండా పొగ రాదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడటం అంటూ జరిగితే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యే అవకాశం వుంది.