టీడీపీ కాంగ్రెస్‌తో జతకట్టాల్సిందే..!

 

టీడీపీ, కాంగ్రెస్ రెండు పార్టీల పద్ధతులు, సిద్ధాంతాలు వేరు.. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులు.. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా.. అందుకేనేమో తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి.. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు పొత్తు అంటూ ఈమధ్య వార్తలు వినిపించాయి.. ఇప్పుడు కొత్తగా వినతులు కూడా మొదలయ్యాయి.. రేవంత్ రెడ్డి ఒకప్పుడు తెలంగాణ టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు.. తరువాత కేసీఆర్ ను ఎదురుకోడానికి కాంగ్రెస్ సరైన వేదికంటూ కాంగ్రెస్ లో చేరారు.. తెరాస పార్టీ మీద, ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు..

అయితే తాజాగా రేవంత్ రెడ్డి టీడీపీ, కాంగ్రెస్ పొత్తు గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను అడ్డుకోవాలంటే విపక్షాలు ఐక్యతతో వ్యవహరించాలని.. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కలిసి వెళితేనే తెలంగాణలో కేసీఆర్‌ను అడ్డుకోవచ్చని రేవంత్ రెడ్డి అన్నారు.. నరేంద్ర మోడీకి కేసీఆర్ ఓ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడిన రేవంత్.. మోడీని అడ్డుకునేందుకు బీహార్, ఉత్తర్ ప్రదేశ్‌లో విపక్షాలు ఎలా అయితే ఏకమయ్యాయో.. తెలంగాణలో కూడా అదే విధంగా విపక్షాలు ఏకంకావాల్సిన అవసరముందని రేవంత్ అభిప్రాయపడ్డారు.