ఇంకా తేలని కాంగ్రెస్ ప్రతినిధులు !

 

 

 

 

తెలంగాణాఫై ఢిల్లీ లో జరగనున్న అఖిల పక్ష సమావేశానికి ఇంకా సరిగ్గా ఒక్క రోజు మాత్రమే ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ నుండి హాజరయ్యే ప్రతినిధుల పేర్లు ఇంకా ఖరారు కాలేదు. బిజెపి, టిఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం లు ఇప్పటికే తమ ప్రతినిధుల పేర్లను ఖరారు చేసాయి.

 

కాంగ్రెస్ పార్టీ నుండి ఉండవల్లి అరుణ్ కుమార్, సురేష్ షెట్కార్ వెళ్తారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతం ఆరుగురు పేర్లను కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సీమాంధ్ర నుండి మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి, శాసన మండలి సభ్యుడు చెంగల్రాయుడు, పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణా ప్రాంతం నుండి మాజీ అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవిల పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

 

తమ ప్రతినిధులుగా ఎవరిని పంపాలనే విషయాన్ని చర్చించడానికి ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ లో మూడు ప్రాంతాలకు చెందిన నేతలతో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ, పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం వర్గాలు ఈ నేతలందరికీ ఫోన్లు చేసి ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అందుబాటులో ఉండాలని సూచించినట్లు సమాచారం.