టీఆర్ఎస్ తో పొత్తుకే కాంగ్రెస్ యోచన

 

‘జుట్టు పట్టుకుని బయటకీడ్చినా చూరు పట్టుకుని వేలాడి’ అన్నట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. పొత్తూలేదు గిత్తూ లేదని కుండ బద్దలుకొట్టిన కేసీఆర్ ను మళ్లీ దేహీ అనేలా కనిపిస్తోంది. అవసరమైతే నేరుగా సోనియా గాంధీయే కేసీఆర్ తో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పూర్తిగా దిగజారిపోయింది. దీంతో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణలో గరిష్టస్థాయిలో ప్రయోజనం పొందాలని ఆ పార్టీ ఆశిస్తోంది. ఇక్కడ పార్టీ పూర్తిగా ప్రయోజనం పొందాలంటే టీఆర్‌ఎస్ తో పొత్తు పెట్టుకోవడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనివల్ల ఓట్లలో చీలిక రాదని, పార్టీకి ఎదురే ఉండదని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో టీఆర్‌ఎస్ పొత్తుకోసం పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నేరుగా రంగంలోకి దిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

టీఆర్‌ఎస్ పొత్తుకు సిద్ధమవుతున్నట్లు వస్తున్న సంకేతాలపై ఇరు పార్టీల్లోనూ మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పొత్తులో భాగంగా సీట్లు ద క్కించుకుంటామనే నమ్మకం ఉన్న నాయకులంతా తమ విజయానికి ఇక తిరుగుండదనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పొత్తు కారణంగా అవకాశాలు కోల్పోతామని భావిస్తున్న నాయకులు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని తాజా మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌తో పొత్తు ఖాయమైతే అధిష్టానం తమ నెత్తిన పాలుపోసినట్లే అవుతుందని సంతోషపడుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభావం అంతగా లేని దక్షిణ తెలంగాణలో మాత్రం పొత్తు వల్ల ఆ పార్టీకి సీట్లు కేటాయించక తప్పదని, ఇది తమకు తీవ్ర నష్టమని ఆందోళన చెందుతున్నారు.