కాంగ్రెస్ పార్టీని ‘కాపు’ కాయగలవారెవరు?

 

ప్రజల చేతిలో ఎన్నిమొట్టికాయలు తిన్నపటికీ మన రాజకీయ పార్టీల, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం ఎన్నటికీ మారకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పదేళ్ళ పాలనలో ఎన్ని తప్పులు చేసినపటికీ వాటిని మరిపించేందుకు ఎన్నికల ముందు ప్రజలకు ఏవో కొన్ని తాయిలాలు విసిరేస్తే గలగలా ఓట్లు రాలిపోతాయనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా నాటుకుపోయుంది.ఈ మూడు నెలలోగా సీమాంధ్రలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకొని మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీ తన నేతలకి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవులను ఎరగా వేస్తోంది.

 

ఇంతకాలం పార్టీకి అండగా నిలబడిన రెడ్లు ఇప్పుడు దూరం కావడంతో, కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో కాపు సామాజిక వర్గాన్ని దువ్వుతోందిపుడు. వారు కూడా అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటూ తమకే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చినట్లయితే తమ కులస్తుల ఓట్లను గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకే పడేలా చేయగలమని హామీలివ్వడం విశేషం. ప్రజలను మనుషులుగా కాక కేవలం ఓట్లుగానే చూసే అలవాటు కాంగ్రెస్ పార్టీ నేతలకి ఎన్నడూ పో(లే)దని ఇది స్పష్టం చేస్తోంది. రాష్ట్ర విభజన చేసినందుకు సీమాంధ్రలో తెలుగు ప్రజలందరూ కుల, మతాలకు అతీతంగా ఉద్యమించారు. తెలుగు జాతిని రెండుగా చీల్చిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు సీమాంధ్ర ప్రజలను కులాలవారీగా చీల్చి ప్రలోభపెట్టి తిరిగి అధికారంలోకి రావాలని అర్రులు చాస్తోంది. సదరు కులానికి చెందడమే ప్రధాన అర్హతన్నట్లు భావిస్తున్నముగ్గురు నేతలు ఈ పోటీలో ఉన్నారు. అయితే వారిలో ఏ ఒక్కరయినా , ఇంతకాలంగా వారి కులస్తులకు ఏమయినా మేలు చేసారా? అని ఆలోచిస్తే లేదనే సమాధానం వస్తుంది. వారు రాష్ట్రంలో కాపు కులస్తులందరికీ తామే అసలు సిసలయిన ప్రతినిధులమని భావించవచ్చును. కానీ సదరు కులానికి చెందిన ప్రజలు కూడా ఆవిధంగా భావిస్తున్నారా? అనేదే ప్రశ్న.

 

అయినా కుల, మత, రాగ ద్వేషాలకి అతీతంగా ప్రజలకు సేవ చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసే ఈ నేతలకు ఆ సంగతి ఎన్నడూ ఎందుకు గుర్తుకు రాదో తెలియదు. కానీ, ఇప్పుడు కేవలం తమ కులస్థుల మీదే అవ్యాజమయిన ప్రేమ ఎందుకు పొంగి పొరలి పోతోందో మాత్రం అందరికీ తెలుసు. తమకు పదవులు ఇస్తే కాంగ్రెస్ పార్టీని కాపాడుతామని, తమ కులాన్ని బీసీ వర్గంలో చేర్చినట్లయితే తమ వాళ్ళను కూడా పడేయగలమని హామీలీయడం ప్రజలంటే వారికి ఎంత చులకనో తెలియజేస్తోంది. నిజంగా తమ కులస్థుల పట్ల సదరు నేతలకి అభిమానమే ఉండి ఉంటే గత పదేళ్లుగా వారికోసం ఏమి చేసారు? వారిని బీసీలలో ఎందుకు చేర్చలేకపోయారు? అని ప్రశ్నించుకొంటే వారి తపన దేనికో అర్ధమవుతుంది. అధికారం తమ కుటుంబసభ్యుల మధ్య తప్ప తమ కులస్థుల మధ్య ఎన్నడూ పంచుకోవడానికి ఇష్టపడని నేతలు ఏ కులానికి చెందిన వారయితే మాత్రం ప్రజలకు ఒరిగేదేమీ ఉంటుంది? అని ఆలోచిస్తే ప్రజలు ఇటువంటి నేతలకు ఓట్లు వేయరు. అప్పడు వారు కూడా ఇటువంటి ఆలోచనలు చేసేందుకు దైర్యం చేయరు.